సినిమా అంటే బిగ్గెర్ దేన్ లైఫ్ అనే మనం వినే ఉంటాం..మనకు కనపడేవాటిని వెండితెరపై సినిమా రూపంలో చూపించడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ చరిత్రలో కనపడని విషయాలను తెరపై ఆవిష్కరించడం అంటే సులువు కాదు. ఆ విషయంలో దర్శకుడు జాగ్రత్తతో పాటు నిర్మాతలు కూడా జాగ్రత్త వహిస్తారు. కథపై ఎంతో నమ్మకం లేకుంటే కొన్ని కథలు సినిమాల రూపంలో ఆవిష్కరించబడవు. అలాంటి అసాధ్యాలు, సుసాధ్యంగా కనపడే సినిమాలు కొన్నే. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాయే `ఘాజీ`. భారత్, పాకిస్థాన్ మధ్య నడిచిన యుద్ధాలు ప్రపంచానికి తెలిసిందే. అయితే తెలియకుండా జరిగిన యుద్ధ నేపథ్యంలో ఘాజీ సినిమా రూపొందింది.బాహుబలి తర్వాత తెలుగు సినిమాపై ఇతర సినిమా రంగాల వారు కూడా కన్నేశారు. ఇలాంటి తరుణంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటి వరకు రూపొందని అండర్ వాటర సబ్‌మెరైన్ మూవీయే ఘాజీ. ఎన్నో భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...
కథ:
1971 భారత్, పాకిస్థాన్ యుద్ధానికి ముందు నెలకొన్న పరిస్థితులతో సినిమా ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో తూర్పు పాకిస్థాన్,పశ్చిమ పాకిస్థాన్ గా అంతర్గతంగా విడిపడి పశ్చిమ పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా విడిపోవాలనుకుంది. ఆ సమయంలో తూర్పు పాకిస్థాన్ నుండి వచ్చిన శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పించింది. తమ దేశంలో అంతర్గత సమస్యలకు ఇండియానే కారణంగా భావించిన పాకిస్థాన్ ఇండియాను దెబ్బ తీయాలనుకుంటుంది.
ఆ ప్రణాళికలో భాగంగా ఇండియన్ నేవీ పరిధిలోని వైజాగ్ ప్రాంతంలో అలజడి సృష్టించాలనుకుంటుంది పాకిస్థాన్. ఘాజీ అనే సబ్‌మెరైన్‌ను పంపుతుంది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఇండియన్ నేవీ ఎస్-21 అనే సబ్‌మెరైన్‌తో ఘాజీని నియంత్రించాలనుకుంటుంది. కానీ ఘాజీ భారత సబ్‌మెరైన్ కంటే ఎన్నో రెట్లు శక్తి వంతమైనది. అయితే ఎస్-21 సబ్‌మెరైన్ కెప్టెన్ రణ్ విజయ్ సింగ్(కె.కె.మీనన్) చాలా ధైర్యవంతుడు, ఆవేశపరుడు. తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం అర్జున్ వర్మ(రానా దగ్గుబాటి)ను నియమిస్తుంది. అప్పుడు రణ్ విజయ్ సింగ్, అర్జున్ ఏం చేస్తారు? ఘాజీపై ఇండియన్ నేవీ విజయం సాధిస్తుందా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమ చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- నటీనటుల పనితీరు
- మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
- ఆర్ట్ డైరెక్షన్
- కథ, స్క్రీన్‌ప్లే
మైనస్ పాయింట్స్:
- క్లైమాక్స్ ఇంకొంత బలంగా వుండాల్సింది
- సెకండాఫ్ కాస్తా ల్యాగింగ్‌గా అనిపించడం
విశ్లేషణ:
చరిత్రలో ఇప్పటి వరకు పెద్దగా తెలియని విషయాన్ని సినిమాగా తెరకెక్కించే నేపథ్యంలో వచ్చిన ఘాజీ విషయంలో కాస్తా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. ఈ విషయాన్ని ముందుగానే తెలియజేశారు. ఇక నటీనటుల పరంగా చూస్తే..రానా, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి క్యారెక్టర్స్ చుట్టూనే ఎక్కువ సినిమా తిరుగుతుంది. బాహుబలి వంటి సక్సెస్ తర్వాత రానా ఘాజీ వంటి డిఫరెంట్ మూవీని చేయడానికి ఆసక్తి చూపడం అభినందనీయం. అర్జున్ వర్మ అనే పాత్రలో రానా చక్కగా ఒదిగిపోయాడు. రానా నటుడుగానే కాకుండా సినిమాలో మేకింగ్‌లో కూడా ఇన్‌వాల్వ్‌మెంట్ కావడంతో సినిమా రేంజ్ పెరిగిందనడంలో సందేహం లేదు. ఇక కెప్టెన్ రణ్ విజయ్ సింగ్‌గా కె.కె.మీనన్, అతుల్ కులకర్ణిల నటన సినిమాకు పెద్ద హైలైట్ అయ్యింది. తాప్సీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఇక సత్యదేవ్, రవివర్మ సహా మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. అలాగే సాంకేతికంగా చూస్తే..ఈ విభాగంలో ముందుగా అబినందించాల్సింది దర్శకుడు సంకల్ప్‌నే. ఘాజీ సబ్‌మెరైన్‌కు సంబంధించిన కథను చక్కగా సేకరించడమే కాకుండా సినిమాటిక్‌గా తెరపై ఆవిష్కరించడంలో మంచి ప్రతిభను కనపరిచాడు. పాత్రలను చక్కగా డిజైన్ చేశాడు. మది సినిమాటోగ్రఫీ సినిమా రేంజ్‌ను నెక్ట్స్ లెవల్‌లో నిలబెట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ కె అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్. ఆర్ట్ డిపార్టెమెంట్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. సినిమా సెకండాఫ్‌లో కాస్తా ల్యాగింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కాస్తా ఎమోషనల్‌గా బలంగా ఉండుంటే ఇంకా బావుండేది. మొత్తం మీద ఇప్పటి వరకు రానటువంటి ఓ విభిన్నమైన కథాంశాన్ని సినిమా చూపించడం గొప్ప విషయం. ప్రతి ఒక భారతీయుడు చూడాల్సిన సినిమా.
బోటమ్ లైన్: ఘాజీ... అందరూ చూడాల్సిన సినిమా
Comments