ఇక అవినీతికి టీకాలు వేసేందుకు సిద్ధమవ్వండి: కమల్ హాసన్
- IndiaGlitz, [Wednesday,March 03 2021]
దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తమ కోసం మాత్రమే కాకుండా ఇతరులకు సోకకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అని కమల్ పేర్కొన్నారు. ‘‘రామచంద్ర ఆసుపత్రిలో నేడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా. ప్రతి ఒక్కరూ తమ కోసం మాత్రమే కాకుండా ఇతరులను సైతం దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ తీసుకోవాలి. శరీరానికి కావల్సిన రోగ నిరోధకత వస్తుంది. దీంతో వచ్చే నెలలో అవినీతికి టీకాలు వేసేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని కమల్ హాసన్ తెలిపారు.
మరోవైపు మక్కల్ నీదిమయ్యంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో తృతీయ కూటమి ఏర్పాటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మక్కల్‌నీదిమయ్యంతో ఎన్నికల పొత్తు కుదుర్చుకునే దిశగా సమత్తువ మక్కల్ కట్చి నాయకుడు, సినీనటుడు శరత్‌కుమార్, ఇందియ జననాయగ కట్చి (ఐజేకే) డిప్యూటీ కార్యదర్శి రవిబాబు ఆళ్వార్‌పేటలోని కమల్‌హాసన్‌ను కలుసుకుని చర్చలు నిర్వహించారు. నిజాయితీపరులను తమ పార్టీలో చేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అసెంబ్లీ ఎన్నికల్లో పళయ కరుప్పయ్య ఓ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారని తెలిపారు.
కాగా..మక్కల్ నీదిమయ్యం తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా నిర్ణయించనున్నారు. ఇప్పటికే పోటీ చేయాలని భావించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థులకు మార్చి 1 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయని కమల్ తెలిపారు. బుధవారం నుంచి కమల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలి విడత అభ్యర్థుల జాబితాను మార్చి ఏడున విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు కమల్ నాయకత్వంలోనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో పళయకరుప్పయ్య, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సహాయకుడు పొన్‌రాజ్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్. రంగరాజన్, చట్ట పంచాయత్తు ఇయక్కమ్ నాయకుడు సెంథిల్ ఆరుముగం, సురేష్ అయ్యర్ సభ్యులుగా ఉన్నారు.