హీరో ఆర్యపై జర్మనీ మహిళ ఫిర్యాదు..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ, తెలుగు భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్న హీరో ఆర్యపై ఓ జర్మనీ యువతి తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదు చేసింది పోలీసులకు కాదు.. ఏకంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రికే సదరు జర్మనీ యువతి ఫిర్యాదు చేయడం గమనార్హం. తనను పెళ్లి చేసుకుంటానని తనను నమ్మించి తన నుంచి 80 లక్షల రూపాయలు తీసుకుని ఆర్య మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆమె జర్మనీ నుంచి వచ్చి చెన్నైలోని ఓ వైద్య సేవల సంస్థలో ఆమె పనిచేస్తోంది. తనకు ఆర్యతో మహ్మద్ అర్మాన్, హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా పరిచయం అయిందని తెలిపింది. కాగా.. లాక్ డౌన్ సమయంలో తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఆర్య చెప్పడంతో అతడికి రూ.80 లక్షలు ఇచ్చానని సదరు యువతి వెల్లడించింది. ఈ డబ్బంతా కూడా తాను ఆర్య తల్లి జమీలా సమక్షంలోనే ఇచ్చానని కానీ ప్రస్తుతం ఆర్య తల్లి కూడా స్పందించడం లేదని తెలిపింది. తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆమె తెలిపింది.
ఆర్య తనతో పాటు మరికొందరు అమ్మాయిలను కూడా మోసం చేశాడని తెలిపింది. ఆర్య మోసానికి సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని.. తనకు న్యాయం జరిగే మార్గం తెలియకనే ఈ ఫిర్యాదు చేస్తున్నట్టు జర్మనీ యువతి.. ప్రధాని, రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలిపింది. ఆర్య తెలుగులో ‘వరుడు’ చిత్రంతో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే రాజారాణి చిత్రం ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే హీరోయిన్ సాయేషా సైగల్‌ను ఆర్య పెళ్లి చేసుకున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments