జార్జిరెడ్డి.. పోరాటాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. విద్యార్థుల సమస్యపైనే కాదు రైతు సమస్యలపై కూడా విద్యార్థులను ఏకం చేసి పోరాటం చేసిన వ్యక్తి. 1972లో ఆయన్ని ఉస్మానియా యూనివర్సిటీలో హత్య చేశారు. ఆయన హత్య పలు అనుమానాలున్నాయి. ఆయన చనిపోయి నాలున్నర దశాబ్దాలు దాటినా ఇంకా జార్జిరెడ్డి పేరు, ఆయన ప్రస్థానం గురించి ఇంకా వినపడుతుందంటే ఆయన చూపిన ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోని బయోపిక్స్ ట్రెండ్‌లో డైరెక్టర్ జీవన్ రెడ్డి ఆయన బయోపిక్‌ను వెండితెరపై ఆవిష్కరిస్తానని అనడంతో అసలు సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. అసలు జార్జిరెడ్డి విద్యార్థి నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఆయన్ని ఎవరు, ఎందుకు చంపారు? అనే విషయాలపై జీవన్ రెడ్డి ఎలాంటి విషయాలను చూపించనున్నారనే విషయాలపై చర్చ మొదలైంది. కొందరు ఈ సినిమా విడుదలపై అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి ఇన్ని చర్చల మధ్య విడుదలైన జార్జిరెడ్డి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందనే విషయాన్ని తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే!
కథ:
లీలావర్గీస్(దేవిక) తనయుడు జార్జిరెడ్డి(సందీప్ మాధవ్). చిన్నప్పటి నుండే స్వతంత్ర్య భావాలతో, విప్లవ ఆలోచనలతో పెరిగి పెద్దవుతాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి కనపరిచే జార్జిరెడ్డి తల్లి ప్రోత్సాహంతో విప్లవవీరులు భగత్ సింగ్, చేగువేరా వంటి వారి జీవిత చరిత్రలను తెలుసుకుంటాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు. అక్కడ నుండి ఉస్మానియా క్యాంపస్‌లోకి అడుగు పెడతాడు. అక్కడ పేద విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలపై జార్జిరెడ్డి గళమెత్తుతాడు. మాటకు మాట, చేతకు చేత అనేలా జార్జిరెడ్డి సమాధానం ఉండటంతో యూనివర్సిటీలో ఏదీ జరిగినా అందరూ జార్జిరెడ్డికే చెబుతుంటారు. పేద విద్యార్థులు కూడా తన వెనకే నిలబడతారు. కేవలం విద్యార్థుల సమస్యలే కాకుండా, రైతు సమస్యలపై కూడా జార్జిరెడ్డి పోరాటం చేస్తాడు. దేశ వ్యాప్తంగా విద్యార్థులందరినీ దీనపై చైతన్య పరుస్తుంటాడు. ఇది ప్రభుత్వంలో కొందరికి పెద్ద సమస్యగా మారుతుంది. ఆ సమయంలో కొందరు ఓ పథకం వేసి జార్జిరెడ్డి హత్య చేస్తారు. అసలు జార్జిరెడ్డిని చంపిందెవరు? ఎందుకు చంపారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
వంగవీటి సినిమాలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న సందీప్ మాధవ్ అలియాస్ సాండీ టైటిల్ పాత్రధారిలో నటించిన మరో చిత్రమే `జార్జిరెడ్డి`. ఇందులో ఎప్పటిలాగానే జార్జిరెడ్డి పాత్రలో సందీప్ ఒదిగిపోయాడు. స్టూడెంట్ నాయకుడిగా జార్జిరెడ్డి ఎలాంటి ఆవేశాన్ని కలిగి ఉన్నాడనేది నేటి తరం విద్యార్థులకు తెలియకపోవచ్చు. కానీ ఆ పాత్రనకు సందీప్ తన నటనతో ప్రాణం పోశాడు. ఇక హీరోయిన్ ముస్కాన్, సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ తదితరులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందరూ నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోవడంతో సదరు నటీనటులని కాకుండా పాత్రధారులే తెరపై కనపడతారు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు జీవన్ రెడ్డి సినిమాను తెరకెక్కించడంలో తనకు దొరికిన విషయ సంగ్రహణకు కాస్త సినిమాటిక్ లిబర్టీని జోడించి సినిమా తీసినట్లుగా కనపడుతుది. జార్జి తండ్రి ప్రభుత్వం ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చినట్లు బయట వార్తలు వినపడుతున్నాయి. కానీ సినిమాలో అసలు జార్జిరెడ్డి పాత్రను చూపించనే లేదు. అలాగే అసలు జార్జిరెడ్డి పాత్ర హైదరాబాద్‌కు ఎందుకు వచ్చిందనేది క్లారిటీ చూపించలేదు. అలాగే ముంబై యూనివర్సిటికీ వెళ్లి పోతానని జార్జిరెడ్డి పాత్ర చెప్పి ఈ స్పీచ్ ఇస్తుంది. తర్వాత ఆ పాత్ర మళ్లీ యూనివర్సిటీలోనే కనపడుతుంది. కొన్ని అనవసరం ఏమో అనుకున్న సన్నివేశాలు కనపడతాయి. జార్జిరెడ్డి పోరాటాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించవు. ఎమోషనల్‌గా ప్రేక్షకుడు సినిమాకు కనెక్ట్ కాడు. అయితే దొరికిన ఆధారాలను బేస్ చేసుకుని సినిమాటివ్ లిబర్టీతో చేసిన సినిమా అని సర్దుకోవాలేమో. పాటల కంటే నేపథ్య సంగీతం, కెమెరా పనితనం బావున్నాయి.
బోటమ్ లైన్: జార్జ్ రెడ్డి.. మరచిపోలేని విద్యార్థి నాయకుడి కథ
Comments