Geoffrey Hinton:కృత్రిమ మేధతో జాగ్రత్త.. ప్రపంచానికి చెప్పాలని గూగుల్‌లో ఉద్యోగానికి ‘‘గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ’’ గుడ్‌బై

  • IndiaGlitz, [Wednesday,May 03 2023]

శాస్త్ర , సాంకేతిక రంగాలు ప్రస్తుతం కొత్తపుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ఏ రోజుకారోజు కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు , ఎన్నో సాధనాలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ప్రస్తుతం సంచలనాలు నమోదవుతున్నాయి. మనిషినే దాటి ఆలోచించే సత్తా ఏఐకి వుందని శాస్త్రవేత్తలు సైతం చెబుతున్నారు. ఇక తాజాగా ఎంట్రీ ఇచ్చిన చాట్ జీపీటీ తుఫాన్ సృష్టిస్తోంది . అయితే కత్తికి రెండు వైపులా పదను వున్నట్లు ఈ ఏఐ పరిజ్ఞానాన్ని సరిగా వినియోగించని పక్షంలో మానవాళికి ముప్పు తప్పదని ఎంతోమంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ‘‘ఫాదర్ ఆఫ్ ఏఐ’’గా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ చేరారు. ఈ విషయాన్ని చెప్పేందుకు గాను ఆయన ఏకంగా గూగుల్ తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.

మనుషుల్ని మించిపోనున్న ఏఐ:

ఆయన ఏమన్నారంటే.. ప్రస్తుతానికి కృత్రిమ మేధ మనుషుల కంటే తెలివైనవి కావన్నారు. కానీ అతి త్వరలోనే అవి మనుషులను దాటిపోయే అవకాశం వుందని హింటన్ హెచ్చరించారు. జీపీటీ వంటివి.. జనరల్ నాలెడ్జ్ అంశంలో ఇప్పటికే మనుషులను క్రాస్ చేశాయని ఆయన గుర్తుచేశారు. ఏఐ వల్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగాల తొలగింపు వుంటుందని హింటన్ హెచ్చరించారు. అలాగే వింతైన ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది కల్పితమో చెప్పలేని స్థితిని సృష్టించగల సత్తా కృత్రిమ మేధకు వుందన్నారు. అందువల్ల ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చూడాలని హింటన్ కోరారు.

హింటన్‌తో పనిచేసిన వారిలో చాట్‌జీపీటీ సృష్టికర్త:

కాగా.. గూగుల్ ఏఐ పరిశోధనల్లో హింటన్ కీలకపాత్ర పోషించారు. దాదాపు దశాబ్ధానికి పైగా ఆయన ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. 2012లో ఆయన ఇద్దరు గ్రాడ్యుయేట్లతో కలిసి ఏఐపై పరిశోధన చేశారు. వారిలో ఒక విద్యార్ధి చాట్‌జీపీటీ సృష్టికర్త.