Geminids Meteor : నేడు ఆకాశంలో అద్భుతం... భూమికి అత్యంత సమీపంగా జెమినిడ్స్ ఉల్కాపాతం
- IndiaGlitz, [Wednesday,December 14 2022]
బుధవారం రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాదిలో చివర ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. డిసెంబర్ 4 నుంచి ఆకాశంలో కనిపిస్తున్న ‘జెమినిడ్స్’ ఉల్కాపాతం ఇవాళ గరిష్టస్థాయికి చేరుకోనుంది. గంటలకు 150 ఉల్కలతో ఆకాశంలో రంగుల దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఉల్కలు శిథిలాలు సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతూ... ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. టెలిస్కోప్ లేకుండానే వీటిని నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే భూమి మీద ఎక్కడి నుంచైనా వీటిని చూడొచ్చని పేర్కొంటున్నారు. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఉల్కాపాతం గరిష్ట స్థాయిని చేరుకుంటుందని, రాత్రి 9 గంటలకు దీనిని మరింత స్పష్టంగా వీక్షించే అవకాశం వుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని ఎవరూ మిస్ చేసుకోవద్దని ఖగోళ నిపుణులు అంటున్నారు.
రేపు భూమికి దగ్గరగా భారీ గ్రహ శకలం:
ఇదిలావుండగా... మన భూమి చుట్టూ నిరంతరం గ్రహశకలాలు తిరుగుతూనే వుంటాయి. అప్పుడప్పుడూ ఇవి భూమికి దగ్గరగా వస్తుంటాయి. వీటి వల్ల ఎప్పటికైనా భూగోళానికి ప్రమాదమే అని భావిస్తున్న నాసా.. ఇటీవలే గ్రహశకలాల్ని పేల్చేసే టెక్నాలజీని విజయవంతంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న 2015 RN35 అనే గ్రహశకలం భూమికి దగ్గరగా రానుంది. అప్పుడు అది మనకు భూ గ్రహానికి 6.86 లక్షల కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ గ్రహశకలాన్ని టెలిస్కోప్ సాయంతో మాత్రమే చూడగలమట. ఇది అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం అంత భారీగా వుంటుందట.