Download App

Geetha Govindam Review

ఇప్పుడు యూత్‌లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర కొండ న‌టించిన మూడో చిత్రం గీత గోవిందం.. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల త‌ర్వాత విజ‌య్ దేవ‌ర కొండ న‌టించిన చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. అయితే ఇది ప‌రుశురాం మేకింగ్ ఫ్యామిలీ మూవీ కావడం.. యూత్‌కి ఫ్యామిలీ కంటెంట్ ఎలా క‌నెక్ట్ అవుతుంద‌నే సందేహం క‌లుగ‌క మాన‌లేదు. అదీ గాకుండా సినిమా విడుద‌ల‌కు ముందే పైర‌సీకి గురి కావ‌డం మ‌రో స‌మ‌స్య‌గా మారింది. మ‌రి గీత గోవిందం ప్రేక్ష‌కుల‌ను మెప్పించారా?  లేదా? అని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం...

క‌థ:

చిన్న‌ప్పుడే త‌ల్లి చ‌నిపోవ‌డంతో గోవిందం(విజ‌య్ దేవ‌ర‌కొండ‌), అత‌ని చెల్లెల్ని తండ్రే(నాగ‌బాబు) పెంచి పెద్ద చేస్తాడు. పెళ్లి చేసుకోబోయే భార్య‌ను త‌ల్లి అంత గొప్ప‌గా చూసుకోవాల‌ని గోవిందం భావిస్తాడు. త‌ను ఇంజ‌నీరింగ్ కాలేజ్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో గుడిలో గీత‌(ర‌ష్మిక మంద‌న్న‌)ను చూసి ప్రేమిస్తాడు. చెల్లెలకు పెళ్లి ఫిక్స్ కావ‌డంతో ఊరికి బ‌య‌లుదేరిన గోవిందంకు గీత బ‌స్సులో ప‌రిచ‌యం అవుతుంది. అనుకోకుండా కొన్ని ప‌రిస్థితుల్లో గీత‌ను గోవిందం ముద్దు పెట్టుకుంటాడు. త‌న త‌ప్పు లేద‌ని చెప్పినా.. గీత విన‌దు. త‌న అన్న‌య్య‌(సుబ్బ‌రాజు)కి చెబుతుంది. బ‌స్సులో నుండి గోవిందం త‌ప్పించుకుని ఊరు వ‌చ్చేస్తాడు. అయితే గీత వాళ్ల అన్న‌య్య‌తోనే గోవిందం చెల్లెలు పెళ్లి జ‌రగ‌నుందని తెలిసి షాక్ అవుతాడు. అయితే గోవిందం చెల్లెలు ముఖం చూసి గీత కూడా అన్న ద‌గ్గ‌ర నిజం చెప్ప‌దు కానీ.. గోవిందంను క్యారెక్ట‌ర్ లేని వ్య‌క్తిగా భావిస్తుంది. అత‌న్ని చాలా ర‌కాలుగా ఇబ్బందులు  పెడుతుంది. చివ‌ర‌కు ఓ సంద‌ర్భంలో గోవిందం మంచివాడ‌నే నిజం గీతకు తెలుస్తుంది. దాంతో గోవిందంపై గీత‌కు ప్రేమ పుడుతుంది. ఇంట్లోవాళ్లు కూడా వాళ్లిద్ద‌రికీ పెళ్లి చేయాల‌నుకుంటారు. కానీ గోవిందం పెళ్లి వ‌ద్దంటాడు. అస‌లు గోవిందం పెళ్లి ఎందుకు వ‌ద్దంటాడు?  చివ‌ర‌కు గీత‌, గోవిందం ఒక్క‌ట‌య్యారా? అనే సంగ‌తులు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.. 

ప్ల‌స్ పాయింట్స్‌:

క‌థ పరంగా చూస్తే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో .. హీరోయిన్ మ‌ధ్య అపార్థాలు రావ‌డం.. చివ‌ర‌కు క‌లుసుకోవ‌డం అనే కామ‌న్ పాయింట్‌ను ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ హ్యాండిల్ చేసిన తీరు అభినంద‌నీయం. ఎందుకంటే క‌థ‌లో స‌న్నివేశాల‌ను..క్లైమాక్స్ ఏంటో ప్రేక్ష‌కుడికి సినిమా స్టార్ట్ అయిన కొంత సేప‌టికే తెలిసిపోతుంది. అయితే  హీరో, అత‌ని స్నేహితులు మ‌ధ్య కామెడీ.. వెన్న‌ల‌కిశోర్ కామెడీ ట్రాక్‌తో ఎక్క‌డా బోర్ కొట్ట‌నీయ‌కుండా స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు ప‌రుశురాం. అలాగే సినిమాలో గోపీసుంద‌ర్ అందించిన పాట‌ల్లో ఇంకేం ఇంకేం కావాలే.. పాట అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది. ఇక నేప‌థ్య సంగీతం బావుంది. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ దేవ‌ర‌కొండలో మ‌రో కొత్త కోణాన్ని ప్రేక్ష‌కులు చూడొచ్చు. చాలా సాఫ్ట్ క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌గా న‌టించాడు. ర‌ష్మిక లుక్స్ ప‌రంగా బావుంది. కొన్ని స‌న్నివేశాల్లో చ‌క్క‌గా న‌టించింది. నాగ‌బాబు, సుబ్బ‌రాజు, ర‌విప్ర‌కాశ్‌, వెన్నెల‌కిశోర్ స‌హా అంద‌రూ మెప్పించారు. 

మైన‌స్ పాయింట్స్‌:

 బేసిక్‌గా ప‌రుశురాం మంచి రైట‌ర్ .. త‌న గ‌త చిత్రాల‌ను గ‌మ‌నిస్తే .. మంచి ఎమోష‌న‌ల్ సంభాష‌ణ‌లుంటాయి. కానీ ఈ సినిమాలో సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్ బావున్నా.. ప‌రుశురాం గ‌త చిత్రాల స్థాయిలో లేదు. అలాగే హార్ట్ ట‌చింగ్ డైలాగ్స్ లేవు. ఒక పాట మిన‌హా మిగిలిన పాట‌లు ఓకే అనిపిస్తాయి. హీరోయిన్.. హీరోని ఏడిపించే స‌న్నివేశాల్లో కొన్ని సినిమాటిక్‌గా ఉంటాయి. కొత్త‌ద‌నం లేని క‌థ‌. 

స‌మీక్ష‌:

ఫ్యామిలీ చిత్రాల్లో ప్రేమ క‌థ‌ల‌ను తెర‌కెక్కించే స‌మ‌యాల్లో స‌న్నివేశాలు గ్రిప్పింగ్, బోరింగ్‌గా ఉండ‌కూడదు. ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ స‌న్నివేశాల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు. సాగ‌దీత లేకుండా స‌న్నివేశాల‌ను క్లాస్‌గా తీశారు. అంటే..ఎక్క‌డా క్లాస్ పీక‌కుండా స‌న్నివేశాల‌ను మ‌లిచారు. కాబ‌ట్టి ఎక్క‌డా బోరింగ్ అనిపించ‌దు. ముందే నుండే ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవం మేజ‌ర్ ప్ల‌స్ అయితే.. మ‌రో మేజ‌ర్ ప్ల‌స్ .. విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆగ‌స్ట్ నెల విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బాగానే క‌లిసొచ్చింది. అర్జున్‌రెడ్డితో స‌క్సెస్ కొట్టిన ఈ కుర్ర హీరో .. ఈ సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడన‌డంలో సందేహం లేదు. అర్జున్‌రెడ్డిలో ర‌ఫ్, యార‌గెంట్‌గా క‌న‌ప‌డ్డ విజ‌య్ ... త‌ప్పును తెలియ‌నివ్వ‌కుండా హీరోయిన్‌ని బ్ర‌తిమలాడుకునే స‌న్నివేశాల్లో.. స్టూడెంట్‌కు బుద్ధి చెప్పే గురువుగా.. ప్రేమ కోసం తాపత్ర‌య ప‌డే ప్రేమికుడిగా చ‌క్క‌గా న‌టించాడు. అలాగే చాలా రోజుల త‌ర్వాత సుబ్బ‌రాజు మంచి క్యారెక్ట‌ర్ ప‌డింది. నాగ‌బాబుకి డబ్బింగ్ చెప్పిన వాయిస్ స‌రిగ్గా లేదు. అన్న‌వ‌రంలో మందు పార్టీ స‌న్నివేశం మెచ్చుకోలుగా లేదు.  మ‌ణికంద‌న్ కెమెరా వ‌ర్క్‌లో విజువ‌ల్స్ బావున్నా.. ఎన్‌హెన్స్ చేసేంత లేక‌పోవ‌డానికి కార‌ణం .. మంచి లొకేష‌న్స్ లేక‌పోవ‌డ‌మే. సినిమానంతా హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా చిత్రీక‌రించిన‌ట్లు క‌న‌ప‌డింది. నిర్మాణ పరంగా ఖ‌ర్చు త‌క్కువే. ర‌ష్మిక న‌ట‌న ప‌రంగా మెప్పించింది. అయితే ఏడుపు స‌న్నివేశాల్లో ర‌ష్మిక ఇంకా బాగా చేసుండొచ్చు. ప‌రుశురాం ..ఎమోష‌న‌ల్ కంటెంట్‌ను బాగానే చూపించినా.. పెన్ ప‌వ‌ర్ కాస్త చూపించి ఉంటే బావుండేది. మొత్తంగా చూస్తే.. సినిమా బోరింగ్ ఉండ‌దు.. అలాగ‌ని మ‌రి ఆస‌క్తిక‌ర‌మైన సినిమా అయితే కాదు.. న‌వ్వుకుంటూ చూసేలా ఉంటుంది. ముఖ్యంగా యూత్‌కు సినిమా క‌నెక్ట్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. 

చివ‌ర‌గా.. గీత  గోవిందం .... ఒకరికొక‌రు 

Geetha Govindam Movie Review in English

Rating : 3.3 / 5.0