'గీతా ఛలో' ఆడియో వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
గోల్డెన్‌స్టార్ గణేశ్, హ్యాట్రిక్ హీరోయిన్ రశ్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా... ఛలో’. వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో ‘చమక్’ పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో ‘గీతా.. ఛలో’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదల అవుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను రామానాయుడు స్టుడియోలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు వీఎన్ ఆదిత్య, శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్, బాలాజీ నాగలింగం తదితర ప్రముఖులు హాజరై పాటలను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాభినందనలు తెలిపారు.
తొలుత చిత్ర ట్రైలర్‌ను అతిథులు వీక్షించారు. అనంతరం పాటలను విడుదల చేశారు. ఈ చిత్రం యొక్క తొలి పాటను నిర్మాత వీఎన్ ఆదిత్య విడుదల చేయగా.. రెండో పాటను ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు. అలాగే మూడో పాటను ప్రేమకథా చిత్రం-2 నిర్మాత సుదర్శన్ విడుదల చేశారు. నాలుగో పాటను శ్రీధర్‌రెడ్డి విడుదల చేశారు. ఇక చివరి పాటను నిర్మాత బాలాజీ నాగలింగం విడుదల చేశారు. ఆడియో సీడీని ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘మామిడాల శ్రీనివాస్‌ది ఎప్పుడూ పోరాటమే. కానీ ఇంకో శ్రీనివాస్‌తో కలిసి ఈ రోజు ఒక మంచి సినిమా చేశారు. ఫైర్‌బ్రాండ్ హీరోయిన్ రశ్మిక మందన్నా ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం. ‘గీతా.. ఛలో’ టైటిల్ కూడా క్యాచీగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా రిచ్‌లుక్ ఉంది. కన్నడలో కంటే ఇక్కడ ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ రశ్మికకు ఇక్కడ అంత మంచి మార్కెట్ ఉంది.’’ అన్నారు.
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘అందరూ హీరోయిన్ గురించే చెబుతున్నారు. ఇక్కడ హీరో గురించి కూడా చెప్పుకోవాలి. గణేశ్ ‘ముంగారు మలే’ సినిమా విడులప్పుడు నేను కర్ణాటకలో ఉన్నాను. ఎలా ఉందో చూద్దామని వెళితే థియేటర్ ఫుల్ అయిపోయింది. అందుకే స్టూల్ వేసుకుని మరీ చూశా. ఆ సినిమా చూశాక చాలా బాగా నచ్చి మళ్లీ ఇంకోసారి వెళ్లి చూశా. గణేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దివాకర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఇక్కడికి వచ్చా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. "హీరోయిన్ తో పాటు హీరోకి కూడా మంచి సక్సెస్ రేటు ఉంది. ఇది డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తోంది. ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా కోసం వాళ్ళు ఆతృతగా ఎదురుచూస్తున్నారు." అని చెప్పారు.
మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘మా గురువు కల్యాణ్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి మేము చాలా కష్టపడ్డాం. కన్నడలో ఈ సినిమా రూ. 30 కోట్లు వసూలు చేసింది. గీతాగోవిదం సినిమాలో ఎలాంటి ఎమోషన్స్, కామెడీ ఉందో ఈ సినిమాలో కూడా అలాంటివి ఉన్నాయి. ఇది యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా నచ్చుతుంది. ఈ నెల 26న విడుదల అవుతుంది. అందరూ తప్పక చూడండి.’’ అన్నారు.
దుగ్గివలస దివాకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నాం. అయితే రశ్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాబట్టి రీమేక్ సినిమాలో చేయదని, ఆమె తప్ప ఈ సినిమాలో ఎవరూ సూట్ అవ్వరని డబ్ చేస్తున్నాం. ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలూ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇది బాగా నచ్చుతుంది. ఈ నెల 21న విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక కూడా చేస్తున్నాం. తర్వాత 26న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ తప్పక చూసి ఆదరించాలని కోరుకుంటున్నా.’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments