Gazette Notification:తెలంగాణ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్

  • IndiaGlitz, [Monday,December 04 2023]

బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలో రావడంతో తెలంగాణ అసెంబ్లీ రద్దు అయింది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై రద్దు చేశారు. దీంతో కొత్త అసెంబ్లీను ఏర్పాటుచేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్‌ను అందజేసింది. అలాగే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్‌కు అందజేశారు.

దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు కానుంది. కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ మరికొన్ని గంటల్లో జరగనుంది. కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి సీఎల్పీ నేతగా ఎన్నికైన వారి పేరును నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం సీఎల్పీ నేతకు సీఎం గుర్తింపు హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. మరోవైపు నూతన ముఖ్యమంత్రి, మంత్రుల కోసం కొత్త కాన్వాయ్‌లను అధికారులు సిద్ధం చేశారు. కొత్త మంత్రుల కోసం సిద్ధం చేసిన అధికారులు వాహనాలను దిల్ కుష అతిథి గృహానికి తీసుకువచ్చారు.