నటుడిగా, నిర్మాణ సంస్థ అధినేతగా, నిర్మాతగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా నాలుగు దశాబ్దాలకు పైబడిన అనుభవజ్ఞుడు డాక్టర్ మంచు మోహన్‌బాబు. విలనిజం, హీరోయిజం రెండిటినీ తనదైన విలక్షణమైన శైలితో చేసి ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఆయన. తాజాగా `గాయత్రి` అనే పేరుతో.. సొంత నిర్మాణ సంస్థలో మదన్ దర్శకత్వంలో సినిమా చేశారు. ద్విపాత్రాభియనం చేసిన ఈ చిత్రంలో ఆయన పెద్ద కుమారుడు విష్ణు కీలక పాత్ర పోషించారు. మంచు హీరోలు చేసిన మ్యాజిక్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? ప్లీజ్ గో త్రూ దిస్..
కథ:
చిన్నతనం నుంచీ నటనంటే ప్రాణం దాసరి శివాజి(మోహన్‌బాబు)కి. ఆ నటనే అతనికి జీవనభృతిగా మారుతుంది. స్టేజ్‌ల మీద నటించడంతో పాటు రియల్ లైఫ్‌ల్లోనూ ధనికులకు బదులు జైళ్లకు వెళ్తుంటాడు. అలా వచ్చిన డబ్బుతో తాను చేరదీసిన అనాథ పిల్లలకు శారదా సదన్‌లో అన్నం పెడుతుంటాడు. పది మంది అనాథల కడుపు నింపితే.. పుట్టగానే ఆశ్రమం పాలైన తన కుమార్తె కూడా ఎక్కడో చల్లగా ఉంటుందని అతని నమ్మకం. ఒకట్రెండు సార్లు అతను గాయత్రి (నిఖిలా విమల్)ని కలుసుకున్నా.. ఆమె తన కుమార్తె అని తెలుసుకోలేకపోతాడు. తీరా తెలుసుకునే సరికి తన కూతురు తనను ద్వేషిస్తోందన్న నిజాన్ని గ్రహిస్తాడు. కానీ అతని స్నేహితుడు ప్రసాద్ (శివప్రసాద్) ద్వారా తన తండ్రి గురించి పూర్తి నిజాలు తెలుసుకుంటుంది గాయత్రి. తండ్రిని కలవడానికి ఆశ్రమానికి వెళ్తుంది. అంతలోనే గాయత్రీ పటేల్ (మోహన్‌బాబు) అతన్ని కిడ్నాప్ చేసి తనకు బదులు జైలుకు పంపుతాడు. అక్కడ శివాజీకి ఉరిశిక్ష పడుతుంది. తాను ఈ చిక్కుల్లో ఇరుక్కోవడానికి కారణం తన కుమార్తె అని తెలుసుకుంటాడు. అది ఎలా? గాయత్రి చేసిన తప్పేంటి? గాయత్రి పటేల్ కి అసలు ఉరిశిక్ష ఎందుకు పడింది? చివరికి గాయత్రికి గాయత్రి పటేల్ నిజ స్వరూపం తెలిసిందా? లేదా? అనేవి గ్రిప్పింగ్ విషయాలు.
ప్లస్ పాయింట్లు:
సినిమా మొత్తం మోహన్‌బాబు ఒన్‌మ్యాన్ షోలా నడిపించారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో మంచు విష్ణు, శ్రియ మధ్య వచ్చే సన్నివేశాలు యువతకు బాగా నచ్చుతాయి. గాయత్రి పటేల్, శివాజీ మధ్య ప్రీ క్లైమాక్స్ లో స్టార్ట్ అయ్యే ఇంటలిజెంట్ వార్ సినిమాకు ఆయువుపట్టు. మోహన్ బాబుకు మేకప్ చక్కగా కుదిరింది. పదేళ్లు వెనక్కి వెళ్లి చూస్తే మోహన్‌బాబు ఎలా కనిపించేవారో.. ఈ సినిమాలో అలాగే కనిపించారు. రెండు గెటప్పుల్లోనూ బావున్నారు. ఆయన తెరపై ఫైట్లు చేస్తుంటే నిజంగా కొట్టినట్టే అనిపించింది. క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ పాయింట్స్. కెమెరా పనితనం బావుంది.
మైనస్ పాయింట్లు:
సినిమా మొదలైనప్పటి నుంచీ కేరక్టర్ల ఎలివేషన్‌కే ఫస్టాఫ్ దాదాపుగా పూర్తయింది. ఎక్కడా కామెడీ లేదు. ఫస్టాఫ్ చాలా సాదాసీదాగా సాగుతుంది. ఇంటర్వెల్ కోసం ఒకానొక దశలో ప్రేక్షకులు నిరీక్షిస్తారు. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. పాటల ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ గా అనిపించదు. హనుమా పాట ఎందుకు తీశారో.. అక్కడ రావాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. ఒకటీ, రెండు తప్పితే పాటలు పెద్దగా జనానికి ఎక్కవు
విశ్లేషణ:
దాదాపు రెండు, మూడేళ్ల తర్వాత మోహన్‌బాబు నటించిన సినిమా.. . పైగా కథ మీద నమ్మకంతో ఆయన సొంత సంస్థలో నిర్మించిన సినిమా ఇది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టింది. తొలిసగం చూసి తొందరపడి బాగాలేదేమో అనేవారు కూడా సెకండాఫ్ చూసి బావుందని మెచ్చుకుంటున్నారు. శ్రియ పాత్ర `మనం` సినిమాను తలపిస్తుంది. విష్ణు తెరమీద కనిపించినంత సేపు బాగా నటించారు. హాస్పిటల్ సన్నివేశంలో అతని నటన కంటనీరు తెప్పిస్తుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్ డైలాగులు. పొలిటికల్ సెటైర్లు ఒక వైపు, పౌరాణికాల ప్రస్తావన ఒకవైపు, మనసును తాకే సెంటిమెంట్ మాటలు మరోవైపు అని అన్నీ వైపులా డైమండ్ రత్నబాబు కమ్మేశారు. ఆయన ఈ సినిమాకు ప్రధాన బలం. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో వచ్చిన సినిమా ఇది. పిల్లలు కనిపిస్తే ఆధార్ కేంద్రాల సాయంతో వాళ్ల తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లవచ్చు వంటి సామాజిక స్పృహతో కూడిన సన్నివేశాలు కూడా అక్కడక్కడా కనిపించాయి. మీడియా మీద ఓ వైపు సెటైర్లు వేస్తూనే, సోషల్ మీడియాల పవర్‌ని కూడా చెప్పారు.
బాటమ్ లైన్: గాయత్రి.. మోహన్‌బాబు ఈజ్ బ్యాక్
Comments