ఇండియన్ పనోరమకు ఎంపికైన ‘గతం’
- IndiaGlitz, [Sunday,December 20 2020]
అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించేందుకు చిత్రాల ఎంపిక పూర్తైంది. ఈ విభాగంలో ప్రదర్శించేందుకు గానూ.. వివిధ భాషలకు చెందిన 20 చిత్రాలను ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి తొమ్మిది రోజుల పాటు గోవాలో ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరగనుంది. దీనికోసం స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత జాన్ మాథ్యూ మత్తన్ సారధ్యంలోని పన్నెండు మంది జ్యూరీ సభ్యులు మొత్తం 183 చిత్రాలను పరిశీలించారు. అనంతరం వాటి నుంచి 20 చిత్రాలను ఎంపిక చేశారు.
అయితే వీటిలో ప్రారంభోత్సవ చిత్రంగా ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రాన్ని ప్రదర్శించాలని జ్యూరీ ప్రభుత్వానికి సూచించింది. ఒక కన్నడ, ఒక తమిళ చిత్రం పనోరమాలో చోటు సంపాదించుకోగా.. మలయాళానికి వస్తే ఏకంగా నాలుగు చిత్రాలు ఎన్నిక కావడం విశేషం. తెలుగు విషయానికి వస్తే.. గత నెల అమెజాన్‌లో విడుదలై, మంచి సక్సెస్ సాధించిన థ్రిల్లర్ ‘గతం’ పనోరమకు ఎంపికవడం విశేషం. భార్గవ పోలుదాసు, రాకేశ్ గాలేభే, పూజిత కురపర్తి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కిరణ్ కొడమడుగుల దర్శకత్వం వహించారు. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్షవర్ధన్ ప్రతాప్ ఈ చిత్రాన్ని నిర్మించారు.