Gas Cylinder-Electricity:గుడ్ న్యూస్.. ఆరోజు నుంచే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ హామీలు అమలు

  • IndiaGlitz, [Friday,February 23 2024]

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సాక్షిగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరో రెండు హామీల అమలు సిద్ధమైందన్నారు. ఫిబ్రవరి 27 నుంచి రూ.500లకే గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితం పథకాలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ రెండు గ్యారంటీల పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్‌ బిల్లులకు సంబంధించి 200యూనిట్లలోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. అలాగే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించేందుకు వీలుగా విధివిధానాలను సిద్ధంచేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? లేక ఏజెన్సీలకు చెల్లించాలా? అనే దానిపై అధికారులు అధ్యయనం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించిందని.. ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని గుర్తుచేశారు.

ఇక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులందరికీ గ్యారంటీలు అందుతాయని క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తుల్లో కార్డు నంబర్లు, విద్యుత్‌ కనెక్షన్‌ నంబర్ల తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారెవరైనా ఉంటే సవరించుకునే అవకాశం ఇస్తాన్నారు. విద్యుత్‌ బిల్లుల కలెక్షన్‌ సెంటర్లు, సర్వీస్‌ సెంటర్లలో ఈ సవరణ ప్రక్రియలు జరగనున్నాయని వివరించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్తామన్నారు. నీటి ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని.. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రేవంత్ వెల్లడించారు.

కాగా బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకున్నారు. ఆయనకు జాతర నిర్వాహకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు. అనంతరం వన దేవతలను దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజలు అనంతరం రెండు హామీలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వన దేవతలను వేడుకున్నట్టు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ ములుగు నుంచే ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. కోటిన్నర మంది భక్తులకు పైగా వచ్చే మేడారం జాతరను జాతీయ పండుగగా మార్చాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలిపారు. కానీ మోదీ సర్కార్ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అలాగే గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్.. వనదేవతలను దర్శించుకోలేదు కాబట్టే ఓడిపోయారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

More News

Telangana Congress:తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు ఖరారు.. త్వరలోనే అధికార ప్రకటన..

గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

CM Jagan:చంద్రబాబు భార్య కుప్పంలో బైబై అంటున్నారు.. ఒంగోలులో సీఎం జగన్ సెటైర్లు..

ఎన్నికలకు మనం సిద్ధం అంటుంటే.. మరోవైపు చంద్రబాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటున్నారని సీఎం జగన్ సెటైర్లు వేశారు.

Revanth Reddy and KCR:ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha)మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Political Leaders:రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న రాజకీయ నేతలు.. ఎందుకంటే..?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత(Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో మరోసారి ప్రయాణాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య హఠాన్మరణం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్మే లాస్య సందిత(Lasya Nanditha)రోడ్డు ప్రమాదంలో హఠానర్మణం చెందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.