అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ ఎంటర్ టైనర్ 'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం' - ప్రవీణ్ సత్తారు
- IndiaGlitz, [Friday,July 14 2017]
అంకుశం, అగ్రహం, మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం''పి.ఎస్.వి.గరుడవేగ 126.18M''. పూజా కుమార్ హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపకుంటుంది. చందమామ కథలు వంటి జాతీయ ఉత్తమ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రవీణ్ సత్తారు పుట్టినరోజు జూలై 14 సందర్భంగా ప్రవీణ్ సత్తారు ఇంటర్వ్యూ విశేషాలు...
గరుడవేగ కథాశం దేనికి సంబంధించింది?
సాధారణంగా మనం పత్రికల్లో ఎక్కడో ఒకచోట బాంబ్ బ్లాస్ట్ జరిగిందనో, లేక బాంబ్‌ను నిర్వీర్యం చేశారనో చదువుతుంటాం. కానీ అలాంటి ఓ ఘటన వెనుక చాలా పెద్ద కథ జరగుతుంది. ఓ విధ్వంసం వెనుక చాలా పెద్ద పెద్దవారు ఉంటారు. ప్రజలను కాపాడే ప్రయత్నం కూడా వివిధ శాఖలవారు చేస్తుంటారు. అలాంటి శాఖకు చెందిన ఎన్.ఐ.ఎ ఆఫీసర్ కథే ఈ సినిమా 'పిఎస్‌వి గరుడువేగ 126.18ఎం'. నేను ఈ కథను 2006లో రాసుకున్నాను. కానీ ఎన్.ఐ.ఎ 2008లో ఏర్పడింది. దీంతో కథలో మార్పులు చేర్పులు చేశాను.
రాజశేఖర్ పాత్ర ఏంటి?
రాజశేఖర్ ఎన్.ఐ.ఎ ఆఫీసర్ పాత్రలో కనపడతారు. ముంభై బాంబు దాడులు అనంతరం 2008లో ఎన్.ఐ.ఎ టీం ఏర్పడింది. అలాంటి టీంలో పనిచేసేవారు. చాలా బాద్యతగా ఉంటారు. అలాంటి ఓ ఆఫీసర్‌కు వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడనేదే పాత్ర.
పూజా కుమార్‌ను హీరోయిన్‌గా తీసుకోవడానికి రీజనేంటి?
విశ్వరూపం, ఉత్తమవిలన్ వంటి చిత్రాల్లో పూజా కుమార్ ఎక్సలెంట్ పెర్ఫామెన్స్ చేసింది. మంచి నటి. ఇక నా కథ పరంగా హీరోయిన్ ఆరేళ్ళ పాపకు తల్లి పాత్రలో కనపడాలనుకున్నప్పుడు పూజా కుమార్ అయితే బావుంటుందనిపించింది.
రాజశేఖర్‌తో సినిమా చేయడానికి కారణం?
గుంటూరు టాకీస్ సినిమా సక్సెస్ తర్వాత జీవిత, రాజశేఖర్‌లు నా వద్దకు వచ్చి మంచి కథ ఉంటే సినిమా చేద్దామని అన్నారు. రాజశేఖర్‌గారు ఎన్నో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించారు. అందులో నాకు మగాడు చిత్రంలో ఆయన క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. నేను మళ్ళీ ఆయన్ను అలాంటి పాత్రలోనే చూడాలనుకున్నాను. వారు నన్ను కలిసినప్పుడు ఆయనకు తగిన విధంగా ఈ కథ ఉందని చెప్పాను. ఆయనకు నచ్చడంతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాను. సినిమా అన్ని ఎలిమెంట్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది.
విలన్ పాత్రలో కిషోర్ గురించి...?
కిషోర్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ చాలా క్రూరుడు. అలాంటి పాత్ర చేయాలంటే మంచి నటుడు కావాలని ముందు చాలా మందిని అనుకున్నాం కానీ చివరకు కిషోర్‌గారి కళ్ళలోని ఇంటెన్సిటి బాగా నచ్చడంతో ఆయన్నే ఈ రోల్ చేయమన్నాను. ఇది భయంకరమైన ఘోస్ట్‌లాంటి పాత్ర. కిషోర్‌గారెంతో అద్భుతంగా చేశారు.
25 కోట్ల బడ్జెట్‌తో సినిమా అంటే ఆలోచించలేదా?
ఓ నిర్మాత సినిమా కోసం 25 కోట్ల రూపాయలు పెడుతున్నామంటే కచ్చితంగా ఆలోచిస్తారు. ముందు ఓ బడ్జెట్ అనుకున్నాం. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత నిర్మాతలకు ఓ నమ్మకం వచ్చింది. ఇంకా బడ్జెట్‌తో తీస్తే అవుట్ పుట్ బాగుంటుందని నాకు ఫ్రీడమ్ ఇచ్చి నాకు కావాల్సిదంతా సమకూర్చారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే కలెక్షన్స్ ఆకాశాన్నంటుతాయని ఇప్పుడు చాలా సినిమాలు నిరూపిస్తున్నాయి. అదే నమ్మకంతో నిర్మాతలు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.
నెక్స్‌ట్ చేయబోయే సినిమాలన్నీ భారీ బడ్జెట్ చిత్రాలేనా?
అలాంటిదేం లేదు. నా తదుపరి సినిమా మూడు కోట్ల బడ్జెట్‌లో కూడా ఉండొచ్చు.
గోపీచంద్ బయోపిక్ గురించి విశేషాలు చెప్పండి?
గోపీచంద్‌గారి జర్నీ అసాధారణం. ఈ సినిమా కథను తయారు చేయడానికి నేను రెండున్నరేళ్ళు కష్టపడ్డాను. నా జర్నీలో ఆయన గురించిన సంగతులు తెలుసుకుని షాకయ్యాను. నార్మల్‌గా సినిమాల్లోని డ్రామా కన్నా మూడు రెట్లు నిజ జీవితంలో నాటకీయత ఉందంటే ఎవరూ నమ్మరేమో. రేపు సినిమాలో చూస్తే అర్థమవుతుంది. సుధీర్‌బాబుగారు ఇప్పుడు గోపీచంద్ బయోపిక్ కోసం సన్నద్ధమవుతున్నారు.