vallabhaneni Vamsi : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అస్వస్థత .. పంజాబ్‌లో చికిత్స , అక్కడికెందుకు..?
- IndiaGlitz, [Wednesday,June 22 2022]
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉన్నత విద్య కోసం పంజాబ్ రాష్ట్రానికి వెళ్లిన వల్లభనేని వంశీ.. అనారోగ్యానికి గురవడంతో వెంటనే మొహాలీలోని ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని వైద్యులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు.
ఐఎస్బీ సీటు సంపాదించిన వంశీ:
ప్రజాప్రతినిధిగా ఉంటూనే ఉన్నతవిద్యను అభ్యసిస్తోన్నారు వల్లభనేని వంశీ.. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) హైదరాబాద్‌లో గతేడాది సీటు సంపాదించారు. అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ మూడో సెమిస్టర్ చదువుతోన్న ఆయన కోర్సులో భాగంగా పంజాబ్‌లోని మొహాలీలో వున్న ఐఎస్బీ క్యాంపస్ కు వెళ్లారు. సోమవారం నుంచి ఆఫ్‌లైన్ తరగతులకు వంశీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో, మంగళవారం ఎడమ చేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో స్థానికంగా వున్న ఓ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. అక్కడి వైద్యులు ఈసీజీ, 2డీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించారు .
చదువులో ఎప్పుడూ ముందే:
ఇకపోతే.. వంశీ ఐఎస్బీలో చదువుకుంటోన్న అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సుకు చాలా ప్రాధాన్యం ఉంది. సివిల్స్ అధికారులు సైతం ఈ కోర్సు కోసం పోటీ పడతారు. జాతీయ స్థాయి పరీక్షలో మెరుగైన ప్రదర్శనతో 40 శాతం స్కాలర్షిప్ సైతం పొందేలా వంశీ సీటు సంపాదించారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుగ్గా వుండే ఆయన 1995లోనే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తో ఎంవీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్‌పై కృష్ణాజిల్లా గన్నవరం నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై వైసీపీకి జై కొట్టిన వంశీ.. వైఎస్ జగన్‌కు మద్ధతుదారుగా మారిపోయారు. ఆయన అనారోగ్యానికి గురయ్యారన్న విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమానులు వంశీ క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.