గంజాయికి ఏపీని హబ్‌గా మార్చారు.. అడ్డుకున్నారనే కక్షతో గౌతం సవాంగ్‌పై వేటు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా గురువారం అమలాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత క్రైమ్ రేటు పెరిగిపోయిందని ఆరోపించారు. అక్కను వేధించొద్దు అన్న పాపానికి బాపట్లలో 14 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగులబెట్టారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలించే నాయకులు బాధ్యతగా లేకపోవడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందన్నారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే దానిని కవర్ చేయడానికి ముందు గుండెపోటు అన్నారని.. తరువాత ఎవరో చంపారని చెప్పారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నిజం బయటకొస్తుందనే భయంతో ఒక వ్యక్తిని దారుణం హత్య చేశారని.. విచారణ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారులను బెదిరించారని పవన్ పేర్కొన్నారు. హత్యకు సంబంధించిన కీలక వ్యక్తిని అరెస్టు చేద్దామంటే అడ్డుకున్నారని జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ కంటే గొప్పవాడివా :
కోనసీమ కేసులో అభంశుభం తెలియని 250 మంది యువకులపై కేసులు పెట్టారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు కావాలని పోరాడిన దళిత నాయకులు... అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరును జగనన్న విదేశీ విద్యా పథకంగా మారిస్తే ఎందుకు మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు. దళితులకు మేనమామననే ముఖ్యమంత్రి.. దళితులకు సంబంధించిన 23 పథకాలను ఎందుకు తొలగించారని నిలదీశారు. అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివా .. పథకానికి నీ పేరు పెట్టుకున్నావ్ అంటూ జగన్‌పై మండిపడ్డారు.
కల్తీ మద్యంతో ప్రాణాంతక వ్యాధులు :
జగన్ బాబు కల్తీ మద్యం అమ్ముతూ ఆడబిడ్డల పసుపు కుంకుమలు తీసేస్తూ.. ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాడని పవన్ పేర్కొన్నారు. చిన్న వయసున్న యువత వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యం తాగి లివర్, కిడ్నీ, పాంక్రియాస్ వ్యాధుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో అత్యంత విషపూరితమైన రసాయనాలు కలిగి వున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు . ఆడపడుచుల కళ్ళలో నీళ్ళు నింపిన పాపం ఊరికేపోదని.. వైసీపీకి కచ్చితంగా తగులుతుందని ఆయన హెచ్చరించారు. సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి విషపూరిత మద్యాన్ని ప్రజలతో తాగిస్తున్నాడని పవన్ ఆరోపించారు.
మద్యం అమ్మకాలతో 23 వేల కోట్ల అక్రమార్జన :
దేశంలో ప్రతి ఉత్పత్తికి జీఎస్టీ ఉంటుందని, పన్ను కట్టాల్సి వుంటుందని ఆయన తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో అమ్ముతున్న మద్యానికి మాత్రం అన్నీ ఎగ్గొట్టి, నగదు లావాదేవీలు చేస్తూ అక్రమ మార్గంలో వేల కోట్లు మళ్లిస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేవలం మూడేళ్లలోనే ఈ ప్రభుత్వం రూ.23 వేల కోట్ల మద్యం అమ్మకాలు సాగించిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చేసుకోవచ్చన్నారు. అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధం చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు మద్యం మీద విపరీతంగా సంపాదించడం మొదలుపెట్టాడని ఆయన మండిపడ్డారు. జనసేన ప్రభుత్వంలో మద్య నిషేధం చేస్తామని హామీ ఇవ్వలేం కానీ... ఆయా ప్రాంతాల్లోని మహిళలు వద్దు అనుకుంటే మద్యం దుకాణాలు లేకుండా చేస్తామన్నారు.
గంజాయిని వదిలేయండి :
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయికి దేశంలోనే ప్రత్యేక హబ్‌గా తయారు చేసిందని పవన్ కల్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడను గంజాయికి గేట్ వే చేశారని.. వీధుల్లోకి, గ్రామాల్లోకి గంజాయి వచ్చేసిందన్నారు. యువతను గంజాయి మత్తులో ఉంచి, వారిలో పోరాట పటిమ లేకుండా చేయాలని ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వారి ఆవయవాలు గంజాయి దెబ్బకు నాశనం అవుతున్నాయన్నారు. జనవాణిలో ఓ తల్లి నా కాళ్ల మీద పడి గంజాయి మత్తులో తన కొడుకు నాశనం అయ్యాడని, ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని వేడుకుందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయిని పూర్తిగా వదిలేయాలని.. మీ కుటుంబాలను శోకంలో ముంచొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గంజాయిలో శీలావతి అనే రకాన్ని వైసీపీ నేతలు విదేశాలకు కూడా రవాణా చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయన్నారు. గంజాయిని భారీగా పట్టుకొని తగులబెట్టినందుకు ఏకంగా అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ని వైసీపీ ప్రభుత్వం పక్కకు తప్పించిందని పవన్ కల్యాణ్ ఆరోపించరాు. దీనిని బట్టి గంజాయిని ఎవరు ప్రొత్సహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments