రచ్చ చేసిన కరాటే కల్యాణి.. నామినేషన్స్ లో గంగవ్వ..

  • IndiaGlitz, [Tuesday,September 08 2020]

తొలిరోజు బిగ్‌బాస్ షో ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైంది. కానీ ప్రేక్షకుల అంచనాలన్నీ మొదటి రోజే పటాపంచలయ్యాయి. తొలి రోజు షోను చూసిన ఎవ్వరికైనా ఒకటే డౌట్ వస్తుంది. ఈ షో ఎంటర్‌టైన్‌మెంట్ కోసమా? లేదంటే ఏడుపుల ప్రదర్శనా? అని.. బిగ్‌బాస్ హౌస్‌లో శానిటైజర్‌తో పాటు గ్లిజరిన్ కూడా పెట్టి ఉంటారేమోనన్న డౌట్ ప్రేక్షకులకు రాక మానదు. గ్లిజరిన్ అవసరం లేకుండా.. ఒకరికి మించి మరొకరు ఏడుపు సీన్లను అద్భుతంగా పండించారు. ఫస్ట్ రోజే కంటెస్టెంట్లంతా పెర్ఫార్మెన్స్ ప్రారంభించేశారు. అసలే ఫేమస్ సెలబ్రిటీలు పెద్దగా షోలో లేరని భావిస్తున్న ప్రేక్షకులకు.. ఈ ఏడుపులు.. ఓదార్పులు చూస్తుంటే చిరాకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది.

ముఖ్యంగా కరాటే కల్యాణి.. తొలిరోజు మామూలు రచ్చ చేయలేదు. సీక్రెట్‌ హౌస్‌లో ఉన్న సయ్యద్ సోహైల్ కాల్ చేయడం.. ఆ కాల్‌ను సుజాత ఆన్సర్ చేయడంతో రచ్చ మొదలైంది. నామినేషన్ సమయంలో ఈ విషయమై కరాటే కల్యాణికి, సుజాతకు మధ్య చిన్న వాగ్యుద్ధం నడిచింది. సూర్యకిరణ్ కలుగ జేసుకుని ఈ వాగ్యుద్ధానికి కామా పెట్టినప్పటికీ ఎలిమినేషన్ ప్రక్రియ ముగియగానే మళ్లీ మొదలైంది. వివరణ ఇచ్చేందుకు సుజాత రావడం.. ఇక మీదట తాను వంట చేయనని.. తినిపెడతానని కల్యాణి చెప్పడం కూడా చిన్నపాటి యుద్ధం లాగే జరిగింది. ఇక సద్దు మణిగిందిలే అనుకున్నాక.. తన బెడ్‌పై కూర్చొని మళ్లీ కరాటే కల్యాణి కొళాయి విప్పారు. లాస్య వారించేందుకు యత్నించగా.. వెక్కి వెక్కి ఏడ్చి కరాటే కల్యాణి సీన్‌ని బాగా రక్తికట్టించేందుకు ప్రయత్నించినట్టుగా అనిపించింది. మళ్లీ అంతలోనే కూల్ అయిపోయిన కల్యాణి.. వంట చేస్తానని వెళ్లి పోవడం పెద్ద ట్విస్ట్.

కాగా.. ఈరోజు షో మొత్తాన్ని పరిశీలిస్తే ఏడుపులు, ఓదార్పులు తప్ప మరేమీ కనిపించలేదు. ఈ షో ఇలాగే కొనసాగితే.. రేటింగ్ దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. ఇక నామినేషన్ విషయానికి వస్తే.. అభిజిత్, సూర్య కిరణ్, సుజాత, అఖిల్, దివి, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. అయితే వీరిలో గంగవ్వకు వచ్చిన ఇబ్బందయితే ఏమీ లేదు. ఆమెకి ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. మిగిలిన ఆరుగురిలోనే పోటీ ఉండనుంది.