బిగ్‌బాస్ స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే షాక్ ఇచ్చిన గంగవ్వ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 4 అంగరంగ వైభవంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. కొన్ని గంటలు కూడా గడవక ముందే గంగవ్వ షాక్ ఇచ్చింది. బిగ్‌బాస్ షోలోకి 16వ కంటెస్టెంట్‌గా గంగవ్వ అడుగు పెట్టింది. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇంత వయసున్న మహిళ షోలో అడుగు పెట్టడం దాదాపు ఇది తొలిసారి. గంగవ్వ వయసు 57 ఏళ్లు. అంటే హోస్ట్ నాగార్జున కంటే నాలుగేళ్లు చిన్నది. తన కట్టు.. బొట్టు.. యాసతో గంగవ్వ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఓ ఏవీ ద్వారా తన కథనంతా వివరించి ప్రేక్షకుల మనసు దోచేసింది. కాస్త భయంగా ఉంది అంటూనే గంగవ్వ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది.
సీజన్ 4 విజేత గంగవ్వ..
తెలంగాణ పల్లె అవ్వకు ఐకానిక్ సింబల్‌లా అనిపించే గంగవ్వ.. టెలివిజన్ స్క్రీన్‌పై కనిపించగానే క్రేజ్ పెరిగిపోయింది. బిగ్‌బాస్ సీజన్ 4 విజేత గంగవ్వేనంటూ సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్‌లో సైతం బిగ్‌బాస్ విజేత గంగవ్వ అంటూ స్టేటస్లు కనిపిస్తున్నాయి. మై విలేజ్ షో వీడియోలతో గంగవ్వ చాలా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం హాట్ హాట్ భామలు.. యంగ్ డైనమిక్ కంటెస్టెంట్లు ఉన్నప్పటికీ నెటిజనులు మాత్రం గంగవ్వకు బ్రహ్మరథం పడుతున్నారు. హోస్ట్ నాగ్.. ఆమెను హౌస్‌లోకి పంపించిన సమయంలో అప్పటికే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు.. ‘ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్‌ను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి.. లేదంటే మీకు కష్టమేనని చెప్పారు’. నాగ్ ఈ మాటను తెలిసి అన్నారో.. తెలియక అన్నారో కానీ.. అక్షరాలా అది బయట జరిగి తీరుతుందనిపిస్తోంది. గంగవ్వకు వ్యతిరేకంగా ఎవరూ వెళ్లినా ప్రేక్షకులు వారికి ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తోంది.
21 వేల లైక్‌లతో దూసుకుపోతున్న గంగవ్వ..
ఈ షో స్టార్ట్ అయి కొన్ని గంటలు కూడా గడవక ముందే గంగవ్వ స్టామినా ప్రేక్షక లోకానికి తెలిసిపోయింది. ‘స్టార్ మా’ తమ అధికారిక ఫేస్బుక్లో కంటెస్టెంట్ల లిస్ట్‌ను ఉంచగా.. ఈ వార్త రాసే టైమ్‌కు గంగవ్వ 21 వేల లైక్‌లతో దూసుకుపోతోంది. ఆమె దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడం విశేషం. రెండో స్థానంలో మొనాల్ గజ్జర్ 6,300 లైక్స్‌తో రెండవ స్థానంలో ఉంది. ఎక్కడ 21 వెయ్యి.. ఎక్కడ 6 వేలు.. ఎంత వ్యత్యాసం.. ఆ తరువాతి వారంతా 3 వేలు.. ఆలోపు లైక్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరీ హాట్ భామ దివి అతి తక్కువ లైక్స్‌తో కొనసాగుతోంది. అమ్మడికి 1.1 లైక్స్ మాత్రమే రావడం గమనార్హం.
గంగవ్వ జీవితం వడ్డించిన విస్తరేం కాదు..
గంగవ్వది జగిత్యాల జిల్లా లంబాడపల్లి. ఆమె జీవితం వడ్డించిన విస్తరేం కాదు.. గంగవ్వ తండ్రి ఆమెకు ఊహ తెలియక ముందే మరణించగా.. 13 ఏళ్ల వయసులో ఆమె తల్లి కూడా మరణించింది. తన తమ్ముళ్ల బాధ్యతను స్వీకరించి సమర్థవంతంగా కుటుంబాన్ని నడిపింది. పెళ్లైన అనంతరం కూడా ఆమెది ప్రశాంతమైన జీవనమేమీ కాదు. తాగుబోతు భర్తతో దినమొక గండంలా గడిపింది. బీడీలు చుడుతూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంది. 15 ఏళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లిన ఆమె భర్త ఆమెకు పంపించిందేమీ లేదు. చివరకు ఆయన జీవితం అక్కడే ముగిసిపోయింది. యూట్యూబ్ ఆమెకు మంచి స్టార్ డమ్ తెచ్చి పెట్టింది. రెండు, మూడు చిత్రాల్లో నటించే అవకాశాన్ని సైతం కల్పించింది. ఇప్పుడు బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలా సాగనుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com