వైవిధ్యమైన కథా చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకోవడమే కాదు.. వరుస విజయాలను దక్కించుకున్న హీరోగా నాని ఓ క్రెడిట్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతి సినిమాను వైవిధ్యమైన కథాంశం, పాత్ర ఉన్నట్లు ఎంచుకోవడమే నాని ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో నాని తన 24వ సినిమాను ప్రముఖ బ్యానర్ మైత్రీ మూవీమేకర్స్‌లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అనౌన్స్ చేశాడు. అంత వరకు బాగానే ఉంది. అయితే టైటిల్‌ను గ్యాంగ్ లీడర్ అని అనౌన్స్ చేయగానే ఓ పక్క ఆ టైటిల్ మాదంటూ ఓ చిన్న వివాదంతో పాటు.. అసలు చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ టైటిల్‌తో నాని సినిమా చేస్తున్నాడేంటి? అసలు దీని కథా కమామీషు ఏంటి? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇందులో దాచడానికి ఏమీ లేదంటూ తొలి టీజర్‌తోనే మెయిన్ పాయింట్‌ను రివీల్ చేసేశాడు డైరెక్టర్. విలన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఐదుగురు మహిళలు(చిన్న పాపతో సహా) ప్లానింగ్ కోసం పెన్సిల్ పార్థసారథి అనే డబ్బింగ్ పుస్తకాల రైటర్ దగ్గరకు వస్తారు. అసలు ఈ పార్థసార్థ ఎవరు? నిజంగా పార్థసారథి గ్యాంగ్ లీడర్‌గా మారి ప్రతీకారంలో పాలు పంచుకున్నాడా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
పెన్సిల్ పార్థసార్‌థి(నాని) హాలీవుడ్ రివేంజ్ సినిమాలు చూసి తెలుగులోకి తర్జమా చేస్తుంటాడు. 28 పుసక్తాలను స్నేహితుడు సాయంతో ప్రింట్ చేయిస్తాడు పార్థసారథి. ఆ పుస్తకాలను చదివిన సరస్వతి(లక్ష్మి) అనే బామ్మ తనతో పాటు వరలక్ష్మి(శరణ్య), పెళ్లి కావాల్సిన వయసున్న అమ్మాయి ప్రియ(ప్రియాంక), కాలేజ్ చదువుతున్న అమ్మాయి స్వాతి(శ్రియారెడ్డి), చిన్నపాప(పాణ్య)లను వెంటబెట్టుకొస్తుంది. 14 నెలల క్రితం బ్యాంకు దోపీడీలో చంపబడ్డ ఐదుమంది నేరగాళ్లకు వీళ్లు ఏదో ఒక రూపంలో బంధువులు. దాంతో వాళ్లు ఆ ఐదు మందిని చంపిన ఆరో వ్యక్తిని చంపాలనుకుంటారు. ప్రియను ఇష్టపడ్డ పెన్సిల్ వారికి తన తెలివి తేటలతో కేసులో అసలు దోషిని కనుగొంటాడు. అసలు దోషి ఎవరు? ఇండియా నెంబర్ వన్ ఫార్ములా వన్ రేసర్ దేవ్(కార్తికేయ)కి, బ్యాంకు దోపీడీకి సంబంధం ఏంటి? చివరకు పెన్సిల్ ఏమవుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- డిఫరెంట్ స్టోరీ లైన్
- నటీనటుల పెర్ఫామెన్స్
- స్టోరీలోని ట్విస్ట్
- కొన్ని సిట్చ్యువేషన్స్
మైనస్ పాయింట్స్:
- నెరేషన్ ఓ ఫ్లోలో ఉండదు.
- కామెడీ గొప్పగా లేదు.
- కథనంలో గొప్ప ట్విస్టులు కనిపించవు
సమీక్ష:
డిఫరెంట్ కాన్సెప్ట్ కథలను ఎంచుకుని చేయడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. ఈ ఏడాది జెర్సీలాంటి ఎమోషనల్ డ్రామాలో నటించిన నాని.. గ్యాంగ్ లీడర్ వంటి రివేంజ్ డ్రామాలో అది కూడా కామెడీ యాంగిల్ చేయడానికి అంగీకరించాడు. కథ పరంగా చూస్తే డిఫరెంట్ పాయింటే. నటుడిగా నాని తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. పెన్సిల్ ఫార్థసారథి అనే డబ్బింగ్ సినిమాల రచయితగా తన నటన ఆకట్టుకుంది. కానీ.. తన పాత్రలో ఎంటర్‌టైన్‌మెంట్ అనుకున్న స్థాయిలో వర్కవుట్ కాలేదు. ప్రియాంక చూడటానికి చాలా బావుంది. పాత్రనుగుణంగా చక్కగా నటించింది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య తదితరులు వారి పాత్రల్లో చక్కగా సూట్ అయ్యారు. ఇక విలన్‌గా నటించిన హీరో కార్తికేయ సూపర్బ్‌గా సూటయ్యాడు. స్టైలిష్ లుక్‌లో విలనిజాన్ని కార్తికేయ చక్కగా ఎలివేట్ చేశాడు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు విక్రమ్ కుమార్ కొన్ని సన్నివేశాలను మాత్రమే ఆసక్తికరంగా చూపించాడు. సినిమా ప్రారంభం బావుంది. అయితే ప్రారంభాన్ని సినిమా ఆసాంతం క్యారీ చేయడంలో, ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా సినిమాను ఓ ఫ్లోలో ముందుకు తీసుకెళ్లుంటే బావుండుననిపించింది. నాని అంటే ఓ స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది. అలాంటి కామెడీ సినిమాలో కనపడదు. వెన్నెల కిషోర్ గే పాత్రలో చక్కగా నవ్వించాడు. అనిరుధ్ సంగీతం బావుంది అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. మిరోస్లా కుబా బ్రోజెక్ కెమెరా పనితనం బాగా ఉంది. మూడ్స్‌ను తన కెమెరావర్క్‌తో ఎలివేట్ చేశారు. బలమైన ఎమోషన్స్ లేకపోయినా దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను చక్కగానే ముందుకు నడిపించారు. అయితే అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. నిర్మాణ విలువలు బావున్నాయి.
చివరగా.. నాని`స్ గ్యాంగ్ లీడర్ .. ఆకట్టుకునే రివేంజ్ డ్రామా
Read Gang Leader Review in English
Comments