చిరు 'గ్యాంగ్‌లీడర్'కి 25 ఏళ్లు
- IndiaGlitz, [Monday,May 09 2016]
'చెయ్యి చూడు.. ఎంత రఫ్ గా ఉందో.. రఫ్పాడిస్తా' అనే మేనరిజమ్‌తో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసిన చిత్రం 'గ్యాంగ్‌లీడర్'. మాస్ ప్రేక్షకులు మెచ్చే కథతో, పాటలతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో సంచలన విజయం సాధించిన చిత్రాల జాబితాలో ఒకటిగా నిలిచిన 'గ్యాంగ్ లీడర్'కి విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. చిరంజీవికి జోడీగా విజయశాంతి నటించిన ఈ చిత్రంలో వారిద్దరి కెమిస్ట్రీ హైలెట్‌గా ఉంటుందీ.
బప్పీలహరి సంగీతంలోని ప్రతిపాట ఆదరణ పొందింది. ఇందులోని 'వాన వాన వెల్లువాయే'ని రామ్ చరణ్ 'రచ్చ' కోసం రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. రావుగోపాల రావు, శరత్ కుమార్, సుమలత, మురళీ మోహన్, సుధ, ఆనందరాజ్, నిర్మలమ్మ, కైకాల సత్యనారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే 9, 1991న విడుదలైంది. అంటే.. 'గ్యాంగ్ లీడర్' ప్రేక్షకుల ముందుకొచ్చి నేటితో పాతికేళ్లు పూర్తవుతోందన్నమాట.