కో డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులు.. 'ఊ అంటావా' సాంగ్ కొరియోగ్రాఫర్‌పై కేసు

  • IndiaGlitz, [Friday,April 01 2022]

చెన్నైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వివాదంలో చిక్కుకున్నారు. తనను లైంగిక వేధిస్తున్నాడంటూ అతడి కోడాన్సర్ ఆయనపై 2020లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గణేష్ ఆచార్యపై చార్జ్‌షీట్‌ ఫైల్ చేశారు ముంబై పోలీసులు. అతడితో పాటు ఆయన అసిస్టెంట్ పై 354-ఎ, 354-సి, 354-డి, 509 ,323, 504 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. గణేష్ ఆచార్య తనతో తప్పుగా ప్రవర్తించడంతో పాటు పోర్న్ వీడియోలు చూపించాడని సదరు కో డ్యాన్సర్ ఆరోపించింది.

అంతేకాకుండా తనను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడని.. మే, 2010లో తనతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను చెప్పినట్లుగా చేస్తే ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లొబరచుకోవాలని చూశాడని ఆరోపించింది. దీనికి తాను నిరాకరించడంతో ఆరు నెలల్లోనే ఇండియా ఫిలిం అండ్ టెలివిజన్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం రద్దు చేయించాడని ఆరోపించింది. అయితే ఈ కేసు విషయంపై గణేశ్ ఆచార్య ఎలాంటి స్పందనా తెలియజేయలేదు.

ఇకపోతే.. గణేష్ ఆచార్య.. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు ఆయన ఎక్కువగా పని చేశారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన 'పుష్ప' సినిమాలో సమంత చేసిన 'ఊ అంటావా మావ' సాంగ్ కి గణేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట దేశాన్ని ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.