Gandhi Hospital Superintendent:రాకేష్ మాస్టర్ కన్నుమూత ..ఆయన మరణానికి కారణమిదే : గాంధీ సూపరింటెండెంట్ ఏమన్నారంటే
- IndiaGlitz, [Monday,June 19 2023]
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం చెందడంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దాదాపు 1500 కు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్‌కు వ్యవహరించి.. ఎంతోమందిని కొరియోగ్రాఫర్లుగా చేసిన రాకేష్ మాస్టర్ ఇకలేరంటే సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం విశాఖ నుంచి వస్తూ తీవ్ర అస్వస్థతకు గురైన రాకేష్ మాస్టర్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు.
తొలుత ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స :
ఇదిలావుండగా ఆయనకు అందించిన చికిత్స తదితర వివరాలపై గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడారు. రాకేష్ మాస్టర్ మధ్యాహ్నాం 1 గంటకు అడ్మిట్ చేశారని ఆయన తెలిపారు. రాకేష్ డయాబెటిక్ పేషెంట్ అని.. అలాగే సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని రాజారావు చెప్పారు. ఆయనకు షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయని , సాయంత్రం ఐదు గంటలకు మృతి చెందిననట్లు రాజారావు ప్రకటించారు. తొలుత ప్రైవేట్ హాస్పిటల్లోట్రీట్మెంట్ పొంది చివరి నిమిషంలో గాంధీ హాస్పిటల్లో ఆయనను చేర్చారని సూపరింటెండెంట్ తెలిపారు.
రెండు నెలల క్రితమే రాకేష్ మాస్టర్‌కు తీవ్ర అస్వస్థత:
అయితే రాకేష్ మాస్టర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఫిలిం నగర్లో చర్చ జరుగుతోంది. ఆయన అసిస్టెంట్ సాజిత్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం హనుమాన్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ చేస్తుండగా రాకేష్ మాస్టర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అప్పుడే రాకేష్ మాస్టర్ ఎంతోకాలం బతకరని డాక్టర్లు అన్నారని సాజిత్ వాపోయారు. గత వారం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖ, భీమవరం వెళ్తి ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారని తెలిపారు. అప్పటికే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారని సాజిత్ చెప్పారు. ఆయన కాళ్లు , చేతులు పడిపోయాయని తెలిపారని.. అంతలోనే రాకేష్ మాస్టర్ ఇకలేరని తెలిసిందన్నారు.