నేటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్‌గా గాంధీ..

  • IndiaGlitz, [Saturday,April 17 2021]

రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటం, మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఔట్‌ పేషెంట్, ఇన్‌ పేషెంట్‌ సేవలు, సర్జరీలు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయమై గాంధీ సూపరింటెండెంట్ రాజారావు క్లారిటీ ఇచ్చారు. కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకే గాంధీని కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చుతున్నట్టు వెల్లడించారు. గాంధీలో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పడకలు, ఇతర వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. ఇక్కడ శనివారం నుంచి కేవలం కోవిడ్‌ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం సీరియస్‌గా ఉన్న 462 మంది కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని రాజారావు వెల్లడించారు.

కాగా.. ఇప్పటికే ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్న సాధారణ రోగులను డిశ్చార్జి చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గాయపడి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నవారిని ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి మళ్లీ పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్‌గా మారిపోయింది. గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకూ పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్‌గా పని చేసిన గాంధీ ఆసుపత్రి అనంతరం వైద్య విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి నుంచి సాధారణ ఓపీ, ఇన్‌పేషెంట్ సేవలను కూడా ప్రారంభించారు. అయితే తాజాగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో.. తిరిగి పూర్తి స్థాయి కోవిడ్ సెంటర్‌గా మార్చినట్టు అధికారులు ప్రకటించారు. గాంధీ ఆసుపత్రిలో ఒక్కరోజే 152 మంది రోగులు ఆరోగ్యం సీరియస్‌‌గా ఉన్న రోగులు అడ్మిట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం గాంధీలో నాన్ కోవిడ్ రోగులు సైతం పెద్ద సంఖ్యలోనే చికిత్స పొందుతున్నారు. అయితే వారందరినీ శుక్రవారం సాయంత్రం నుంచే డిశ్చార్జ్ చేయడం ప్రారంభించారు.

ఇక గాంధీ ఆసుపత్రి విషయానికి వస్తే మొత్తం 1890 పడకలున్నాయి. 400 వెంటిలేటర్, 1250 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 1890లో 300 పడకలను కోవిడ్ కోసం కేటాయించగా.. రోగుల సంఖ్య పెరిగితే ఓపీ, లైబ్రరీ భవనాల్లో మరో 300 బెడ్లు అదనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి దాదాపు ఫుల్ అయింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం ఓపీ, కులీకుతుబ్‌షా భవనం కలిపి ఇప్పటికే 630 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆసుపత్రి పూర్తి స్థాయి కోవిడ్ ఆసుపత్రిగా మారిపోవడంతో ఉస్మానియాకు రోగుల తాకిడి మరింత పెరిగింది. రోజుకు 2 వేల వరకూ రోగులు ఆసుపత్రికి వస్తున్నారు. ఇతర ఏరియా ఆసుపత్రిల్లోనూ అధికారులు బెడ్‌ల సంఖ్యను పెంచారు.