Download App

Game Over Review

థ్రిల్ల‌ర్లు గ‌ట్టిగా అల‌రించాలే కానీ, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కాసులు గ‌ల‌గ‌లా రాలుతాయి. మంచి స్క్రీన్‌ప్లే, ప‌ర్ఫెక్ట్ యాక్టింగ్‌, దానికి త‌గ్గ కెమెరా, రీరికార్డింగ్ క‌నుక కుదిరితే ఇక థ్రిల్ల‌ర్ల‌కు తిరుగుండ‌నేది స‌క్సెస్ ఫార్ములా. తాజాగా తాప్సీ కూడా ద‌క్షిణాదిన ఈ ఫార్ములా సినిమాను చేసింది. గ‌తంలోనూ ఆమెకు థ్రిల్ల‌ర్ల‌లో న‌టించిన అనుభ‌వం ఉంది. ఈ తాజా సినిమాతో ఆమె తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉంది?  వీల్ చెయిర్ లో కూర్చుని తాప్సీ చేసిన న‌ట‌న మెప్పించిందా? త‌మ్సప్ చేసేలా ఉందా?  రివ్యూలోకి వెళ్దాం.

క‌థ‌:

హైద‌రాబాద్ న‌గ‌రు శివారు ప్రాంతాల్లో ఒంటిరిగా ఉండే మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేస్తూ ఓ సైకో గ్యాంగ్ వ‌రుస హ‌త్య‌లు చేస్తుంటారు. అలా అమృత అనే అమ్మాయిని చంపేస్తారు. పోలీసుల‌కు కూడా ఎలాంటి ఆధారాలు దొర‌క‌వు. క‌థ ఇలా సాగుతుంటుంది. మ‌రో ప‌క్క‌.. యానిమేష‌న్ గేమ‌ర్ అయిన స్వ‌ప్న(తాప్సీ ప‌న్ను) త‌న‌కు న‌చ్చిన టాటూ వేయించుకోవ‌డానికి డిసెంబ‌ర్ 31న బ‌య‌ట‌కు వ‌స్తుంది. టాటూ వేయించుకుంటుంది. కానీ రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో ఆమెను ఓ వ్య‌క్తి కిడ్నాప్ చేసి రేప్ చేస్తాడు. ఆ ఫోటోల‌ను నెట్‌లో పెట్టేస్తాడు. దాంతో స్వ‌ప్న మాన‌సికంగా కృంగిపోతుంది. బ‌య‌ట‌కు రాలేక‌పోతుంది. చీక‌టిని చూసి భ‌య‌ప‌డుతూ ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆమె చేతికి వేసుకున్న టాటూ కార‌ణంగా ఆమె విప‌రీత‌మైన నొప్పిని భ‌రిస్తుంటుంది. ఈ నేప‌థ్యంలో ఆమె టాటూ గురించిన ఓ అస‌లు విష‌యం ఆమెకు తెలుస్తుంది. దాంతో స్వ‌ప్నకు మాన‌సిక ధైర్యం వ‌స్తుంది. ఇంత‌కు స్వ‌ప్న‌కు తెలిసిన నిజ‌మేంటి?  సైకోల‌ను స్వ‌ప్న ఎలా ఎదిరిస్తుంది?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే  సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:

ప్ర‌స్తుతం ప్యాన్ ఇండియా యాక్ట్రెస్ అయిన తాప్సీ.. ద‌క్షిణాదిన మాత్రం సినిమాల‌ను అచి తూచి ఎంచుకుంటూ ఉంది. ఓకేసారి తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల్లో  సినిమా చేయ‌డం మంచి ప‌రిణామ‌మే. మూడు షేడ్స్ ఉన్న వీడియో గేమ‌ర్ పాత్ర‌లో తాప్సీ అద్భుతంగా న‌టించింది. చీక‌ట్లో భ‌య‌పడుతూ.. త‌న‌పై జరిగిన అఘాయిత్యానికి బాధ‌ప‌డుతూ త‌ల్లిదండ్రుల‌కు దూరంగా ఉండే అమ్మాయి.. మాన‌సిక ధైర్యాన్ని ఎలా తెచ్చుకుంద‌నేదే షేడ్స్‌లో త‌ను చ‌క్క‌గా న‌టించింది. ఇక సినిమాలో ప‌నిమ‌నిషిగా చేసిన మ‌హిళ‌, అమృత పాత్ర‌లో న‌టించిన అమ్మాయి ఎవ‌రూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం లేని ముఖాలే. అయితే వారంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు చ‌క్క‌గా న్యాయం చేశారు. మాయ చిత్రాన్ని తెరెక్కించిన ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ సినిమాను చ‌క్క‌గా తెరకెక్కించాడు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రిగిన‌ప్పుడు ధైర్యంగా ప‌రిస్థితులు ఫేస్ చేయాలే కానీ.. భ‌య‌ప‌డ‌కూడ‌దు అనే విష‌యాన్ని చ‌క్క‌గా పొట్రేట్ చేశాడు. దానికి అమృత అనే అమ్మాయి పాత్ర‌ను క్రియేట్ చేసి ఇన్‌స్పిరేష‌నల్‌గా చూపించాడు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో పోరాడాల‌నే విష‌యాన్ని ఆ పాత్ర‌ను బేస్ చేసుకుని చెప్పిన తీరు బావుంది. హీరోయిన్ ఫేస్ చేసే మూడు స‌మ‌స్య‌ల‌ను మూడు ర‌కాల పాత్ర‌ల‌ను క్రియేట్ చేసి తెర‌కెక్కించిన తీరు బావుంది. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. తెలుగులో తాప్సీ త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం మంచి ప‌రిణామం. ఆమె క‌మిట్‌మెంట్‌ను తెలియ‌జేస్తుంది. ఫ‌స్టాఫ్ అంతా తాప్సీ ఏదో స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుందని చెప్ప‌డానికే స‌రిపోయింది. దీంతో సినిమా సాగ‌దీత‌గా అనిపిస్తుంది. ఇక సినిమా క్లైమాక్స్‌ను మూడు పార్టులుగా తెర‌కెక్కించ‌డం సామాన్య ప్రేక్ష‌కుడికి క‌న్‌ఫ్యూజింగ్ విష‌య‌మే. అయితే మ‌నిషి మానసిక ప‌రిస్థితికి ధైర్యం చెప్పేలా ద‌ర్శ‌కుడు చేసిన ప్ర‌య‌త్నాన్ని అభినందించాలి.

బోట‌మ్ లైన్‌:  గేమ్ ఓవ‌ర్‌... ఆక‌ట్టుకునే థ్రిల్ల‌ర్‌

Read 'Game Over' Review in English

Rating : 3.0 / 5.0