Gali Janardhan Reddy: బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి.. పార్టీ విలీనం..
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి(Gali Janardhana Reddy) తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ముందు కల్యాణరాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించారు. ప్రస్తుతం గంగావతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ కండువా కప్పుకున్నారు. భార్య అరుణ లక్ష్మితో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులతో సహా బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సమక్షంలో పార్టీని విలీనం చేశారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్రహోం మంత్రి అమిత్‌షాని కలిశారు. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఆయన మద్దతివ్వడం గమనార్హం.
పార్టీ విలీనం తర్వాత జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ "ఇటీవలే ఢిల్లీలో కేంద్రహోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యాను. ఆ సమయంలోనే నా రాజకీయ భవిష్యత్ గురించి చర్చ జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బయట నుంచి మద్దతునిచ్చే బదులు పూర్తిగా బీజేపీలో చేరిపోవాలని ఆయన సలహా ఇచ్చారు. నా రాజకీయ ప్రస్థానం మొదలైందే బీజేపీ నుంచి. అందుకే ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూ పార్టీలో చేరుతున్నాను. పదవులు ఆశించి మాత్రం పార్టీలో చేరడం లేదు" అని తెలిపారు.
కాగా కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుగా ఉన్న ఆయన అరెస్టై జైలు జీవితం గడిపారు. 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారు. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కడపలో పర్యటించరాదని కోర్టు పలు షరతులు విధించింది. ఈ ఆంక్షల కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి నుంచి పోటీ చేశారు. అయితే అరెస్ట్ కావడంతో తమకు గాలి జనార్థన్‌రెడ్డితో సంబంధం లేదని బీజేపీ నేతలు స్పష్టంచేశారు. దీంతో గత ఏడాది కొత్త పార్టీని ప్రకటించడంతో పాటు తన సోదరులు కరుణాకర రెడ్డి, సోమశేఖర్ రెడ్డితో పాటు అనుచురుడు శ్రీరాములు కూడా బీజేపీలోనే కొనసాగడంపై మండిపడ్డారు.
అయితే బళ్లారి జిల్లాలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిన జనార్దన్‌రెడ్డికి చిత్రదుర్గ, కొప్పల్, రాయచూర్ వంటి జిల్లాల్లో గణనీయమైన పలుకుబడి ఉందని.. ఇవి లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగపడతాయని కమలం నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయనను తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. మొత్తానికి కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ స్థానాల్లో 25కు పైగా స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ పెద్దలు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments