Gaganyaan Mission 2023: గగన్‌యాన్ మిషన్ గ్రాండ్ సక్సెస్.. ఫలించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఇస్రో మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అంతరిక్షంలోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు చేపట్టిన గగన్‌యాన్ మిషన్ సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన కీలక ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్(TV-D1)’ వాహకనౌక పరీక్షను విజయవంతంగా పరీక్షించింది. రెండు వాయిదాల తర్వాత మూడోసారి రాకెట్ ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించింది. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి వేరు చేశాయి. నింగిలో 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్లు తెరుచుకోవడంతో సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.
గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో ఇది మొదటి విజయం..
ఈ ప్రయోగం విజయం సాధించటం ద్వారా భవిష్యత్తులో రాకెట్లో సమస్యలు తలెత్తినా అందులో వ్యోమగాములకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు రచిస్తామని ఇస్రో తెలిపింది. తొలుత టీవీ-డీ1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని గుర్తించి సరిచేశారు. అనంతరం రెండోసారి ప్రయత్నించగా విజయవంతమైంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను దీని ద్వారా విశ్లేషించగలిగామన్నారు. తొలుత లిఫ్ట్ ఆఫ్ అయ్యే ముందు చిన్న సమస్య ఎదురైందని, అందుకే ప్రయోగంలో జాప్యం జరిగిందని చెప్పారు. ఇస్రో గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో ఇది మొదటి విజయమని సోమనాథ్ ప్రకటించారు.
అసలు ఎందుకు ఈ పరీక్ష..?
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. మూడు రోజులు అంతరిక్షంలో ఉన్న తర్వాత వారిని తిరిగి భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర చేపట్టాలని భావిస్తుంది. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానాలపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా తొలుత టీవీ-డీ1 పరీక్షను నిర్వహించింది. ఇందులో క్రూ ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలించారు. మనుషులతో వ్యోమానౌకతో కలిసి నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్లో ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్ నుంచి వేరు చేసి సురక్షితంగా కిందకి తీసుకువచ్చే ప్రక్రియనే క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటారు. ఆ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు టీవీ-డీ1 ప్రయోగం ద్వారా పరీక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout