Gaddam Prasad:తెలంగాణ శాసనసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్
- IndiaGlitz, [Thursday,December 14 2023]
తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. ఆయనను తీసుకెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతిగా ఎన్నికైన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్ చరిత్ర సృష్టించారు. కాగా బుధవారం సాయంత్రంతో స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ప్రసాద్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం ఎంపీటీసీగా మొదలైంది. అనంతరం 2008 ఉప ఎన్నికలో తొలిసారిగా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి వికారాబాద్ నుంచి విజయం సాధించారు. 2012లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో టెక్స్టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మూడవ స్పీకర్గా ఎన్నికయ్యారు.
అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే ప్రమాణస్వీకారం చేయని ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, బీజేపీ శాసనసభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు.