Gaddam Prasad:తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం
- IndiaGlitz, [Wednesday,December 13 2023]
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ(బుధవారం) సాయంత్రంతో స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. గడ్డం ప్రసాద్ మాత్రమే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. రేపు సభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా స్పీకర్ ఎన్నికపై ప్రకటన చేయనున్నారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. స్పీకర్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో మొదలైంది. వికారాబాద్ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 ఉప ఎన్నికలో తొలిసారిగా వికారాబాద్ నుంచి గెలుపొందారు. తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తిరిగి వికారాబాద్ నుంచి విజయం సాధించారు. 2012లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మళ్లీ గెలిచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మూడవ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
కాగా డిసెంబర్ 9న మూడవ శాసనసభ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. అనంతరం సభను డిసెంబర్ 14కు వాయిదా వేశారు. దీంతో రేపు(గురువారం) తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు. అనంతరం ఆయన స్పీకర్ సీట్లో ఆసీనులవుతారు. ఇక 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 16న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది.