Gaddalakonda Ganesh Review
తమిళంలో హిట్ అయిన సినిమా జిగర్తాండ. ఆ సినిమాకు రీమేక్‌గా `వాల్మీకి`ని తెరకెక్కించారు. చిత్ర విడుదలకు ఒక రోజు ముందు బోయ సామాజిక వర్గం ఆక్షేపణల మేరకు చిత్రం టైటిల్‌ను `గద్దలకొండ గణేష్` అని మార్చారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పేరు అదే. `తొలిప్రేమ`, `ఫిదా`తో హిట్ మీదున్న వరుణ్‌కి `అంతరిక్షం` కాస్త బ్రేక్ వేసింది. ఇప్పుడు మళ్లీ మునుపటి జోరు `గద్దలకొండ గణేష్` తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు వరుణ్. మెగా కాంపౌండ్‌లో `గబ్బర్‌సింగ్`తో హిట్ అయిన హరీశ్ శంకర్ ఇప్పుడు అబ్బాయికి `గద్దలకొండ గణేష్` అనే పేరుతో ఎలాంటి చిత్రాన్నిచ్చారో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:
గద్దలకొండ ప్రాంతాన్ని తన రౌడీయిజంతో గజగజలాడిస్తుంటాడు గణేష్(వరుణ్‌తేజ్). అందరూ అతన్ని గద్దలకొండ గణేష్ అని పిలుస్తుంటారు. అతనికి లోక్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది. ఎమ్మెల్యేకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆయన కొడుక్కి గణేష్ అండగా నిలబడతాడు. అదే సమయంలో అభి(అధర్వమురళి), ఓ డైరెక్టర్ దగ్గర సహాయ దర్శకుడిగా చేరుతాడు. సెట్‌లో ఓ అవమానం జరగడంతో తాను ఏడాదిలోపే డైరెక్టర్‌నవుతానని ఛాలెంజ్ చేసి వస్తాడు. కథను తయారు చేసుకునే క్రమంలో గద్దలకొండలోని తన స్నేహితుడి దగ్గరకు వెళతాడు. గణేష్ గురించి తెలుస్తుంది. ఏదో గ్యాంగ్‌స్టర్ కథను తయారు చేయడం కంటే.. నిజమైన గ్యాంగ్‌స్టర్ కథతో సినిమా తీయాలనుకుని గణేష్‌ను వెంబడిస్తాడు. అతని గురించి వివరాలు తెలుసుకుంటుంటే గణేష్ వారిని బంధిస్తాడు. అయితే తనపై సినిమా చేస్తారని తెలియడంతో సినిమా కథకు సపోర్ట్ చేస్తానని ముందుకు వస్తాడు. గణేష్‌తో సీటీమార్ అనే సినిమాను చేసి విడుదల చేస్తాడు అభి. సినిమా పెద్ద హిట్ అవుతుంది. అదే సమయంలో గణేష్ మనసు పడ్డ బుజ్జమ్మ అభితో వెళ్లిపోతుంది. అభిని పట్టుకున్న గణేష్ అతన్ని చంపేస్తాడా? లేక తనకు సినిమా లైఫ్ ఇచ్చినందుకు వదిలేస్తాడా? అసలు గణేష్ జీవితంలో శ్రీదేవి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్:
- వరుణ్ తేజ్ నటన
- కథనం
- కామెడీ
- ఫ్లాష్ బ్యాక్
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు
- సాగదీతగా అనిపించే సన్నివేశాలు
- నిడివి
విశ్లేషణ:
పక్కా మాస్ సినిమా. వరుణ్ తేజ్ గెటప్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. లుక్ చూడగానే బావుందని చాలా మంది అన్నారు. వరుణ్ లుక్‌తోనే కాదు.. నటనతో కూడా ఆకట్టుకున్నాడు. తన డైలాగ్ డెలివరీ కూడా బావుంది. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ కావాలనుకునే పాత్రలో అధర్వమురళి నటించిన తొలి తెలుగు చిత్రమిది. చక్కగా నటించాడు. శ్రీదేవి పాత్రలో పూజా హెగ్డే కాసేపే కనిపించినా ఆకట్టుకుంటుంది. అల్లరి పిల్లగా మృణాళిని చక్కగా నటించింది. అసలు ఈ సినిమాను హరీశ్ శంకర్ రీమేక్ చేస్తాడంటే సరే! అనుకున్నారు. కారణం గబ్బర్‌సింగ్‌తో తాను రీమేక్‌లు బాగా చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే తమిళ మాతృకలో గ్యాంగ్‌స్టర్‌గా నటించిన బాబీ సింహాకు ఆ పాత్రకు నేషనల్ అవార్డ్ దక్కింది. ఆ పాత్రను వరుణ్ తేజ్ చేస్తాడనగానే అసలు వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్ర పక్కా మాస్ లుక్ ఎలా సూటవుతుందో ఏమో అనుకున్నారు. కానీ హరీశ్ తొలి ప్రయత్నంలోనే వరుణ్ తేజ్ లుక్‌ను అందరికీ మెప్పించేలా మార్చి ఆకట్టుకున్నాడు. అలాగే శోభన్‌బాబు, శ్రీదేవి నటించిన ఎల్లువెత్తి పాట.. రీమేక్‌ను కూడా అదే రెట్రో స్టైల్లో చేసి శభాష్ అనిపించుకున్నాడు. అలాగే మాస్ ఆడియన్స్ కోసం జర్రా జర్రా.. సాంగ్‌ను యాడ్ చేశాడు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి హరీశ్ శంకర్ చేసిన ప్రయత్నాలన్నీ బావున్నాయి. తమిళ చిత్రాన్ని తెలంగాణ యాసలో విలన్ పాత్రనున డిజైన్ చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు హరీశ్ శంకర్ చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. సత్య కామెడీ ట్రాక్ బావుంది. అధర్వ, మృణాళిని రవి కామెడీ ట్రాక్ బావుంది. హరీశ్ శంకర్ డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. మిక్కీ జె.మేయర్ సంగీతంలో రెండు పాటలు బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఐనాంక బోస్ సినిమాటోగ్రఫీ బావుంది.
బోటమ్ లైన్... గద్దలకొండ గణేష్ ... మాస్ ఎంటర్‌టైనర్
Read Gaddalakonda Ganesh Review in English
- Read in English