ఏపీలో ఇకపై ఎస్సెమ్మెస్‌ల ద్వారా కరోనా ఫలితం..

  • IndiaGlitz, [Wednesday,June 10 2020]

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ప్రతి రోజూ వేల సంఖ్యలో టెస్ట్‌లు చేస్తుండటంతో వందల సంఖ్యలో కేసులు రావడం పెద్ద విషయమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా బెటరే అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వేలాది సంఖ్యలో టెస్ట్‌లు చేస్తున్న తరుణంలో ఎవరికి పాజిటివ్ వస్తుందో.. ఎవరికి నెగిటివ్ వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఆప్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా ఫలితం ఎవరికీ తెలియకుండా ఆయా రోగికి సంబంధించిన వారికి మాత్రమే తెలిసేలాగా మొబైల్‌కు ఎస్సెమ్మెస్ ద్వారా నెగిటివ్వా.. పాజిటివ్వా అనేది తెలియనుంది.

ఇదీ అసలు పరిస్థితి..

ఈ వెసలుబాటు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత ఫలితాలు తెలుసుకునేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. కానీ ఇప్పుడ్నుంచి ఆ జాప్యాన్ని నివారించి, బాధితులకు త్వరగా చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఎస్సెమ్మెస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజంగా ఇది చాలా మంచి పరిణామం అని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్ చేయగానే రోగి లేదా కుటుంబ సభ్యుల నెంబర్ తీసుకుంటారు. దీనికంటే ముందుగా కరోనా పరీక్ష చేయించుకున్న సమయంలో సెల్‌ఫోన్ నంబరు నమోదు చేయించుకుంటే సంబంధిత వ్యక్తి మొబైల్‌కు వైద్య ఆరోగ్య శాఖ ఓ లింకు పంపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా ఫలితాన్ని చూసుకోవచ్చు. కరోనా పరీక్షల ఫలితాన్ని వైద్యులు, సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆన్‌లైన్ ద్వారా పంపిస్తుండటం మంచి పరిణామం. సమస్యలు తలెత్తడంతో ఈ ఎస్సెమ్మెస్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని ఆరోగ్య, సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ మీడియాకు వెల్లడించారు.

కేసుల సంఖ్య ఇలా..

ఇదిలా ఉంటే.. ఏపీలో ఇప్పటి వరకూ 3990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 2403 మంది కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1510 మంది మాత్రమే రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకూ 77 మంది కరోనాతో చనిపోయారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితులు చాలా మేలేనని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రం కూడా చేయని రీతిలో ఏపీలో మాత్రమే టెస్ట్‌లు చేయడం సంతోషించదగ్గ విషయమే.

కొత్త కేసుల సంగతి ఇదీ..

కాగా.. గత 24 గంటలుగా 15,384 శాంపిల్స్‌ను పరీక్షించగా 136 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకూ 181 మీడియా బులెటిన్‌ను ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసింది.