అప్పుడు స్నేహం.. ఇప్పుడు వైరం

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

టాలీవుడ్ స్టార్ హీరోల్లో నాగార్జున ఒక‌రు. నాగ్ కెరీర్ ప్రారంభంలో విజ‌య‌శాంతితో క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు. త‌ర్వాత త‌ర్వాత నాగార్జున సినిమాల‌తో పాటు త‌న వ్యాపారాల‌కు ప‌రిమితం అయ్యారు. కానీ విజ‌య‌శాంతి మాత్రం రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక‌ప్పుడు సినిమాల ప‌రంగా స్నేహంగా ఉన్న వీరిద్ద‌రి మ‌ధ్య ఓ వ్య‌వ‌హారం దూరం పెంచుతుంది. అదేంటంటే .. ఇటీవ‌ల కాలంలో విజ‌య‌శాంతి నాగార్జున ఎన్ క‌న్వెన్ష‌న్ స‌మ‌యంలో భూ ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డ్డారని.. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ గ‌ళ‌మెత్తారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌కు ట్వీట్ కూడా చేశారు.

ఇటీవ‌ల కాలంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.సి.ఆర్ భూ ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను ఆన్‌లైన్ చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్బంలో విజ‌య‌శాంతి కె.సి.ఆర్‌కు ఇలా ట్వీట్ చేయ‌డం కొస‌మెరుపు. కొన్నేళ్ల క్రితం క‌న్వెన్ష‌న్ కోసం నాగార్జున భూ ఆక్ర‌మ‌ణ చేశార‌ని ప్ర‌భుత్వ అధికారులు కూడా ఆయ‌న‌కు నోటీసులు పంపిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సమ‌స్య‌ను నాగ్ ఎలాగో ప‌రిష్క‌రించుకున్నారు. మ‌ధ్య అడ‌పా ద‌డ‌పా కొంత మంది నాయ‌కులు నాగ్‌పై చ‌ర్య‌లేవీ అంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నా.. వ్య‌వ‌హారం కామ్‌గానే ఉంటూ వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ విజ‌య‌శాంతి నాగార్జున‌పై చ‌ర్య తీసుకోవాలంటూ ముఖ్య‌మంత్రిని కోరారు. మ‌రి టి.ఆర్‌.ఎస్ ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం.