Free Bus Travel: ఏపీలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం.. వైసీపీ ప్రభుత్వం కసరత్తు..
- IndiaGlitz, [Saturday,December 23 2023]
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇప్పుడు ఇదే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల అజెండాగా మారుతుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం టీడీపీ కంటే ముందే ఈ హామీని అమలు చేయాలని సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆర్టీసీ అధికారులతో సీఎంవో, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఏపీలో కూడా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం, విజయవాడలోని సిటీ సర్వీసుల్లో అమలు చేయాలని భావిస్తున్నారట. దీనిపై అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ నిబంధనలతో ఏ టైపు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు? ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది? ఆ లోటు పూడ్చటానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? ఇలా ప్రతి దానిపై సర్వే చేస్తున్నారని తెలుస్తోంది. వీలైతే సంక్రాంతి పండుగ నుంచి ఈ హామీని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు .
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అంచనా. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని భావిస్తున్నారు. అలాగే అన్ని రకాల బస్‌పాస్‌లు కలిగిన వాళ్లు 10 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఇందులో 3-4 లక్షల మంది విద్యార్థినులు, మహిళలు ఉంటారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే ప్రయాణికుల ద్వారా ఆర్టీసీకి సగటున రూ.17 కోట్ల వరకూ ఆదాయ వస్తోంది. ఒకవేళ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమలుచేస్తే నిత్యం రూ.6 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఈ ఆదాయాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేయనుందో దానిపై నివేదిక సిద్ధం చేస్తున్నారట.