Foxconn:తెలంగాణకు కొనసాగుతోన్న పెట్టుబడుల ప్రవాహం.. ‘ ఫాక్స్‌కాన్ ’ భారీ ఇన్వెస్ట్‌మెంట్
- IndiaGlitz, [Thursday,March 02 2023]
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే వుంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూ గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీని ద్వారా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ఫాక్స్‌కాన్ ప్రకటించింది. దీనిపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఇటీవల ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌తో కేటీఆర్ భేటీ:
మంత్రి కేటీఆర్.. ఇటీవల ఢిల్లీలో ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియూతో భేటీతో అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పెట్టుబడులు పెట్టేందుకు వున్న అనుకూలతలు, రాష్ట్ర పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్ వంటి అంశాలను కేటీఆర్ వివరించారు. ఈ క్రమంలో మంత్రి ఆహ్వానంపై యంగ్ లియూ గురువారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇబ్రహీంపట్నంలో ప్లాంట్ ఏర్పాటుకు డిసైడ్ అయ్యారు. అనంతరం ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.