కలకలం.. ఏపీలో నలుగురికి కరోనా..!

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా హైదరాబాద్‌కూ వచ్చేసింది. హైదరాబాద్‌‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సికింద్రాబాద్‌లోని మహేంద్రా హిల్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఎప్పుడేం జరుగుతుందో అని తెలుగు రాష్ట్రాల జనాలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు.

అసలేం జరిగింది!?
ఇదిలా ఉంటే ఒక్కరోజు గ్యాప్‌లోనే ఏపీకి కూడా ఈ వైరస్ పాకింది!. బెజవాడకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ అతన్ని నగరంలోని కొత్త ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం జీజీహెచ్‌ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తిని లక్ష్మా‌రెడ్డి (45) గుర్తించారు. పూర్తి వివరాల్లోకెళితే.. ఇటీవల హైదరాబాద్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డ ఆయన.. ఉద్యోగ రీత్యా జర్మనీలో 17రోజులు బస చేశాడు. అనంతరం అక్కడ్నుంచి బెంగుళూరు- హైదరాబాద్ విమానంలో ప్రయాణం చేశాడు. అప్పట్నుంచి తీవ్ర జలుబుతో భాద పడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యలు నిర్వహించిన బెజవాడ వైద్యులు.. కరోనా బారిన పడిన వ్యక్తి సాంపుల్స్ హైదరాబాద్ నుంచి పూణే యూనిట్‌కు తరలించారు. అయితే రిపోర్టులు రావడానికి 72గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. రిపోర్టులు వచ్చే వరకూ కరోనా బారిన పడిన లక్ష్మా రెడ్డికి బెజవాడ ప్రభుత్వ వైద్యులు ప్రత్యేక వైద్యం అందించనున్నారు.

మరో ముగ్గరికి..!
ఇదిలా ఉంటే.. విశాఖలో మరో రెండు అనుమానిత కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని చెస్ట్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఆ ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. రాత్రి తండ్రి, కూతురు ఇద్దరూ కౌలాలంపూర్ నుంచి విశాఖకు వచ్చారు. ఇద్దరికీ తీవ్ర జ్వరం రావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డుకు అధికారులు తరలించి వైద్యం అందిస్తున్నారు. కాకినాడలో ఒకరిద్దరి కరోనా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అంటే విశాఖలో ఇద్దరు, కాకినాడలో ఒకరు అనుమానితులు కాగా.. విజయవాడలో ఇంకొకరు అంటే మొత్తం నలుగురు అనుమానితులు ఉన్నారన్న మాట.

దేశ వ్యాప్తంగా పరిస్థితి ఇదీ..!
కాగా.. భారత్‌లో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 21కి చేరింది. 15 మంది ఇటాలియన్ టూరిస్ట్‌లకు కరోనా పాజిటివ్ అని వైద్యులు గుర్తించారు. ఐటీబీపీ క్యాంప్‌లో చికిత్స కోసం వారిని అధికారులు తరలించారు. దేశంలో ఇప్పటి వరకూ 438 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇంకా 189 మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు మీడియాకు వెల్లడించారు.