Venkaiah Naidu:బెజవాడ ‘‘పాక ఇడ్లీ’’ తిన్న వెంకయ్య నాయుడు.. గన్నవరం నుంచి పత్యేకంగా విజయవాడకి, షాకైన హోటల్ ఓనర్
- IndiaGlitz, [Tuesday,May 02 2023]
భారతదేశం భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకత. వేష భాషలు, సాంప్రదాయాలు వేరు వేరుగా వుంటాయి. కానీ భిన్నత్వంలో ఏకత్వమనే గొప్ప లక్షణం మనదేశానికి ప్రపంచం జేజేలు పలికేలా చేస్తోంది. ఇదిలావుండగా.. భారతదేశపు వంటకాలు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ప్రత్యేకం. ఇక అసలు విషయంలోకి వెళితే.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయవాడలోని ప్రఖ్యాత పాక ఇడ్లీ తిన్నారు. కేవలం ఇందుకోసమే ఆయన గన్నవరం నుంచి ప్రత్యేకంగా బెజవాడ వచ్చారు. నగరంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ సెంటర్లో వెంకయ్య నాయుడు మంగళవారం బ్రేక్ ఫాస్ట్ కోసం మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి నేతి ఇడ్లీని తిన్నారు.
సాంప్రదాయ వంటకాలే తినాలన్న వెంకయ్య నాయుడు:
అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తాను కేవలం నేతి ఇడ్లీ తినేందుకే గన్నవరం నుంచి విజయవాడ వచ్చానని తెలిపారు. నాణ్యమైన ఇడ్లీలు అందిస్తున్నారని ఆ హోటల్ యజమాని కృష్ణప్రసాద్‌ను అభినందించారు. గతంలో విజయవాడ వచ్చినప్పుడు ఒకసారి తాను ఇక్కడ ఇడ్లీ తిన్నానని.. ఇదంటే తనకు చాలా ఇష్టమని వెంకయ్య అన్నారు. ప్రజలు సాంప్రదాయ వంటకాలనే ఆహారపు అలవాట్లుగా మార్చుకోవాలని.. పిజ్జాలు, బర్గర్ల ద్వారా ఆరోగ్యం పాడవుతుందన్నారు. యువతకు ఈ విషయంలో తల్లిదండ్రులు చెప్పాలని.. వ్యాయామం ఎంత ముఖ్యమో మన సాంప్రదాయ వంటకాలు తినడం కూడా అంతే ముఖ్యమని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఆ హోటల్‌కు రావడంతో దాని యజమాని, సిబ్బంది, స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
విశాఖ వాసెన పోలీకి ఫిదా అయిన వెంకయ్య నాయుడు :
ఇకపోతే.. గతంలో ఉప రాష్ట్రపతి హోదాలో విశాఖ పర్యటనకు వచ్చిన వెంకయ్య నాయుడు చిట్టెం సుధీర్ అనే వ్యక్తి చేసిన ‘‘వాసెన పోలీ ఇడ్లీ’’కి ఫిదా అయ్యారు. రాగి, ఇతర సిరి ధాన్యాలతో చేసిన ఆ ఇడ్లీ తనకు ఎంతో రుచిగా అనిపించిందని వెంకయ్య నాయుడు అప్పట్లో అన్నారు. అంతేకాకుండా అందరూ ఆ ఆరోగ్యకరమైన ఇడ్లీని రుచి చూడాలని ఆయన ట్వీట్ చేశారు.