కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి కన్నమూత
- IndiaGlitz, [Sunday,July 28 2019]
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి(77) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ 1: 28 గంటలకు జైపాల్ రెడ్డి కన్నుమూశారు. కాగా.. కొద్ది రోజులుగా ఆయన నిమోనియా వ్యాధితో బాధపడుతున్నారు. కాగా.. తీవ్ర జ్వరంతో ఈనెల 20న జైపాల్‌రెడ్డి ఆస్పత్రిలో చేరారు. 1942 జనవరి 16న జన్మించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాడుగుల జైపాల్‌రెడ్డి జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై మక్కువ!
కాగా.. జైపాల్‌రే విద్యార్థి దశనుంచే రాజకీయాలంటే మక్కువ ఉండేది. ఓయూలో ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్, బీసీజే చదివిన ఆయన.. ఇక్కడ్నుంచే విద్యార్థి నాయకుడిగా ఉంటూ వచ్చారు. 1969లో తొలిసారి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. 1969-1984 కాలంలో జనతా పార్టీ తరపున నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో టీడీపీతో పొత్తులో భాగంగా మహబూబ్‌నగర్ ఎంపీగా తొలిసారి గెలుపొందారు.
జైపాల్ ట్రాక్ రికార్డ్ ఇదీ..!
ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో చేరారు. 1979 నుంచి 1988 వరకు జనతాపార్టీలో కొనసాగారు. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీపై పోటీచేసిన జైపాల్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. 1985-1988 వరకు జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1984లో తొలిసారి ఎంపీగా గెలిచారు. 1991-1992లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1998లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ఐకే గుజ్రాల్ హయాంలో సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మన్మోహన్ కేబినెట్‌లో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999-2000లో సభాహక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే.. 1999లో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
ఐదుసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు!
ఐదుసార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు జైపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. 1984, 1998, 1999, 2004, 2009లో ఎంపీగా గెలుపొందారు. 1984, 1998లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచి సేవలందించారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలిచారు. 2009లో చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. కాగా.. దక్షిణాది నుంచి ఈ అవార్డు అందుకున్న తొలివ్యక్తి జైపాల్‌రెడ్డి కావడం విశేషమని చెప్పుకోవచ్చు.
తెలంగాణ బిల్లులో.. రిలయన్స్‌కు!
అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్నారని ముఖేష్ అంబానీకి ఫెనాల్టీ విధించి.. కేంద్రమంత్రిగా జైపాల్‌రెడ్డి సంచలనం సృష్టించడం ఈయనకే చెల్లింది. అప్పట్లో ఈయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. రిలయన్స్‌కే షాకివ్వడం అంటే ఆషామాషీ విషయమేం కాదు!. అంతేకాదు..
తెలంగాణ బిల్లులో జైపాల్ రెడ్డికి కీలకపాత్ర
పోషించారు. బిల్లును రూపొందించడంలో కేంద్రమంత్రిగా ప్రభుత్వానికి పార్టీకి సంధాన కర్తగా ఉండేవారు. తెలంగాణ బిల్లు రూల్ పొజిషన్ తీయించకుంటే బిల్లు పాసయ్యేది కాదని కొందరు రాజకీయ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే యాభై ఏళ్ల ప్రజాజీవితంలో మచ్చలేని రాజకీయ నేతగా జైపాల్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ప్రముఖుల సంతాపం..
జైపాల్ మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కాంగ్రెస్ నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రితో తమకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకుని ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు పలువురు రాజకీయ నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
అంత్యక్రియలు..
జైపాల్ రెడ్డి భౌతిక కాయానికి సోమవారం నెక్లెస్‌రోడ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు జైపాల్ రెడ్డి పార్థివ దేహాన్ని గాంధీభవన్‌కి తరలిస్తారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కడసారి చూపు కోసం అక్కడ ఉంచబోతున్నారు. ఆ తర్వాత గాంధీ భవన్ నుంచీ జైపాల్ రెడ్డి భౌతిక కాయాన్ని నెక్లెస్ రోడ్డుకు అంతిమయాత్రగా తరలించనున్నారు. పీవీ ఘాట్ పక్కనే అంత్యక్రియలు నిర్వహించాలని అనుకుంటున్నారు. అలాగే జైపాల్ రెడ్డికి ఓ స్మారక చిహ్నం కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.