DGP Anjani Kumar:తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్ సస్పెన్షన్ ఎత్తివేత
- IndiaGlitz, [Tuesday,December 12 2023]
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీకుమార్‌కు భారీ ఊరట దక్కింది. ఆయనసై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. ఎన్నికల ఫలితాలు వెల్లడి రోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయన కలవడంతో ఈసీ ఆయనను సస్పెండ్ చేస్తూ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై ఆయన వివరణ ఇస్తూ.. రేవంత్ రెడ్డి పిలవడంతోనే వెళ్లి కలిశానని.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లఘించంలేదని తెలిపారు. మరోసారి ఇలా జరగదని చెప్పడంతో.. అంజనీ కుమార్ విజ్జప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో అంజనీకుమార్‌ను మళ్లీ డీజీపీగా నియమిస్తారా..? లేక మరో పోస్టింగ్ ఇస్తారా..? అనేది తేలనుంది.
కాగా డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే ఆయన డీజీపీ హోదాలో రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ పూర్తి కాకుండానే రాజకీయ నేతలను కలవడం నిషేధమని తెలిపింది. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరపాలని ఆ భేటీలో అంజనీకుమార్‌తో రేవంత్ రెడ్డి చర్చించారు. దీనిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి రవి గుప్తాను తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అంజనీకుమార్ వివరణతో సంతృప్తి వ్యక్తంచేసిన సీఈసీ సస్పెన్షన్ ఎత్తివేసింది.