Sugunamma: తిరుపతి సీటుపై పునరాలోచించాలి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కంటతడి..
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా కొంతమంది నేతలకు టికెట్ దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు పొత్తులో టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది పార్టీలు మారుతుంటే.. మరికొంతమంది రెబల్స్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఏం చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తాజాగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ(Sugunamma)కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని ఇన్నాళ్లు భావించిన సుగుణమ్మకు చుక్కెదురైంది.
ఈ సీటును జనసేనకు కేటాయించడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పార్టీకోసం కష్టపడిన తనకు టికెట్ దక్కకపోవడం బాధాకరమన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఆమె కోరారు. తిరుపతిలో టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశానని, చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని సుగుణమ్మ ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే తాను అంగీకరించినా పార్టీ కేడర్ అంగీకరించడం లేదని వాపోయారు.
తిరుపతి అభ్యర్థిపై చంద్రబాబు, పవన్ మరోసారి పునరాలోచిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదని అన్నారు. తిరుపతిలో వైసీపీ నేతల ఆగడాలపై అడుగడుగునా పోరాటం చేశానని గుర్తుచేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే ఆలోచన లేదని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి పునరాలోచన చేస్తారని తనకు నమ్మకం ఉందని సుగుణమ్మ వెల్లడించారు.
కాగా చిత్తూరు నుంచి వైసీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. ఈ క్రమంలోనే పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకు రాగా.. ఆ పార్టీ తరుఫున ఆరణి శ్రీనివాసులను పవన్ కల్యాణ్ ఖరారుచేశారు. అయితే తిరుపతి సీటును టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆశించారు. అవసరమైతే జనసేనలో చేరి అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ తిరుపతిలో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో కాపు సామాజికవర్గం నేత అయిన శ్రీనివాసులకు జనసేన టికెట్ ఇచ్చింది. దీంతో శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడంపై టీడీపీతో పాటు జనసేనలోని మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మొన్నటి దాకా వైసీపీలో ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదాన్ని ఇరు పార్టీలు అధినేతలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com