మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనాతో మృతి
- IndiaGlitz, [Saturday,August 01 2020]
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు(60) కరోనాతో మృతి చెందారు. కరోనా సోకడంతో 20 రోజుల క్రితం మాణి్క్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. అయితే శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో వారం క్రితం ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై ఉన్న మాణిక్యాలరావు శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014-2018 వరకూ టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
తన మిత్రుడికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చిందని.. వెంటనే తాను, తనతో పాటు కుటుంబ సభ్యులంతా పరీక్షలు చేయించుకున్నామని.. ఆ టెస్టులో తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని పైడికొండల మాణిక్యాలరావు జులై 4న ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా సోకితే భయపడకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకుందామని వెల్లడించారు. అందరూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరుతున్నానని మాణిక్యాలరావు వెల్లడించారు.
అనంతరం మరోసారి అంటే జులై 25న తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘నా ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులు ఎవరు నమ్మవద్దు.కంగారు పడవద్దు, అధైర్య పడవద్దు. నేను ఆరోగ్యంగానే వున్నా. భగవంతుని ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో నేను పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను’’ అని మాణిక్యాలరావు తెలిపారు.