Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో కుటుంబసభ్యులు..!

  • IndiaGlitz, [Thursday,May 23 2024]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుడివాడలోని తన స్వగృహంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ అకస్మాత్తుగా సోఫాలో కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. కార్యకర్తలు, గన్‌మెన్లు వెంటనే వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం నానికి సెలెన్ ఎక్కించిన్నట్లు సమాచారం. దీంతో కొడాలి నాని కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్న కొడాలి నాని కుటుంబసభ్యులు హుటాహుటిన గుడివాడ బయలుదేరారు.

కాగా గత రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో కొడాలి నాని బిజీబిజీగా పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం గుడివాడలోని తన నివాసంలో ఆయా మండలాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళి, ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం నందివాడ మండల వైసీపీ నేతలతో నాని భేటీ అయ్యారు. వారితో చర్చలు జరుపుతుండగానే ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు, ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు. కొడాలి నాని గతంలో కరోనా బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఎంజీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు.

ఇదిలా ఉంటే గుడివాడ రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగాయి. గత నాలుగు ఎన్నికల్లో పోటీ అనేది లేకుండా కొడాలి నాని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం గుడివాడలో టీడీపీ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీ అభ్యర్థి వెనిగెండ్ల రాము నుంచి కొడాలి నాని సరైన పోటీ ఎదుర్కొన్నారు. దీంతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం మద్దతుదారులు ఈసారి గుడివాడలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెబుతుండగా.. వైసీపీ సపోర్టర్స్ మాత్రం స్వల్ప మెజార్టీతోనైనా కొడాలి నాని విజయం సాధిస్తారని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఎవరు జెండా పాతుతారో తెలియాలంటే జూన్ 4వరకు ఆగాల్సిందే.