Former IAS PV Ramesh:చంద్రబాబు అరెస్ట్.. మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు, సీఐడీపై ప్రశ్నల వర్షం

  • IndiaGlitz, [Monday,September 11 2023]

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం, చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను ఆదివారం రాత్రి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌కు నిరసనగా టీడీపీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇదిలావుండగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలకపాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ మీడియా ముందుకు వచ్చారు.

సీఐడీ తీరుపై అనుమానంగా వుంది :

తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనడం హాస్యాస్పదమన్నారు. తాను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవమన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని సీఐడీని రమేశ్ ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆర్ధిక శాఖ ఎలాంటి తప్పు చేయలేదని.. సీఐడీ తీరుపై తనకు అనుమానం కలుగుతోందని రమేశ్ వ్యాఖ్యానించారు. తాను చెప్పినదానిని సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందనే అనుమానం కలుగుతోందని.. నిధులు విడుదల చేసినవారిలో కొందరి పేర్లు ఎందుకు లేవని పీవీ రమేశ్ ప్రశ్నించారు. ప్రధానంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఎండీ, కార్యదర్శిల పాత్రే కీలకమని.. అలాంటప్పుడు వారి పేర్లు ఎందుకు లేవని ఆయన నిలదీశారు.

ఆ ఫైల్స్ ఏమయ్యాయి :

ముఖ్యమంత్రి హోదాలో వుండేవారు నిత్యం కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారని.. ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాలని పీవీ రమేశ్ తెలిపారు. ప్రతి బ్యాంక్ ఖాతాలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. అప్పుడు విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏమయ్యాయి అని పీవీ రమేష్ ప్రశ్నించారు. సీఎం.. అధికారుల మీద ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించడం జరగని పని అని ఆయన పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అధికారులు చేసిన తప్పుకు మాజీ సీఎంను ఎలా అరెస్ట్ చేస్తారని పీవీ రమేశ్ నిలదీశారు.