Former DSP Nalini:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని.. ఏమన్నారంటే..?

  • IndiaGlitz, [Saturday,December 30 2023]

తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని(Former DSP Nalini) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉంది. ఉద్యోగం ఇప్పుడు నాకు అవసరం లేదు. డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయటపడ్డాను... ఇప్పుడు నాది ఆధ్యాత్మిక మార్గం. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వేదం , యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నాను. సనాతన ధర్మం ప్రచారానికి పనిచేస్తాను. గతంలో తనతో పాటు ఉన్న ఉద్యోగులు.. డిపార్ట్‌మెంట్‌లో ఎదుర్కొన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికు రిపోర్ట్ ఇచ్చాను. తనలా ఎవరు బాధ పడవద్దన్నదే నా అభిప్రాయం. నాడు బ్యూరోక్రసీ మీద నమ్మకం పోయింది. అందుకే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నాను. నాకు జరిగిన అన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాను. నా మనస్సుకు నచ్చిన సేవ చేస్తున్నాను. ఇన్నాళ్ల నా మనోవ్యథను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు.

కాగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై కొరడా ఝుళిపించలేక డీఎస్పీ ఉద్యోగానికి నళిని రాజీనామా చేశారు. దివంగత ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో పోస్టింగ్ ఇచ్చిన ఆమెకు ఎదురైన వేధింపుల వల్ల మళ్లీ రిజైన్ సమర్పించారు. అనంతరం రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలని భావించి బీజేపీలో చేరారు. అయితే అక్కడ కూడా కలిసి రాకపోవడంతో ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నారు.

2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను గుర్తించి తిరిగి పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల జరిగిన పోలీసు అధికారుల సమీక్షా సమావేశంలో ఆదేశించారు. డీఎస్పీగా కాకపోయినా అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అయితే ఆమె మాత్రం ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో ఉన్నానని.. ఉద్యోగం చేసేందుకు తాను సుముఖంగా లేనని సున్నితంగా తిరస్కరించారు.