TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం
- IndiaGlitz, [Thursday,January 25 2024]
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి(Mahendar Reddy) నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై(Tamilisai) ఆమోదం తెలిపారు. దీంతో త్వరలోనే ఆయన TSPSC ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్క్రీనింగ్ కమిటీ మరో ఇద్దరి పేర్లను పరిశీలించినా చివరకు మహేందర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. తెలంగాణకు చెందిన మహేందర్ రెడ్డి వరంగల్ ఎన్ఐటిలో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం ఐపీఎస్‌గా ఎంపికై గోదావరిఖని ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2017 నుంచి 2022 వరకు తెలంగాణ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకం ఖరారైన నేపథ్యంలో ఇక సభ్యుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. కొత్త బోర్డు సభ్యులను నియమించిన తర్వాతే పోటీ పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక TSPSC ప్రక్షాళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. చైర్మన్ పదవితో పాటు కమిషన్ సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించింది.
గత అనుభవాల దృష్ట్యా పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించే వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఎంపిక చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో పాటు పరీక్షల నిర్వహణలో బోర్డు తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీలో బోర్డులో పని చేసే ఉద్యోగుల హస్తం ఉండటం రాజకీయంగా పెను దుమారం రేపింది. దీంతో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్, 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్ పదవితో పాటు 8 మంది సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఛైర్మన్ ఎంపిక ఖరారు కావడంతో త్వరలోనే సభ్యుల నియామకం పూర్తి చేయనున్నారు.