Former CM KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు సొంతింటి కష్టాలు.. ఎక్కడుండాలి..?
- IndiaGlitz, [Friday,December 08 2023]
ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు సీఎం హోదాలో అధికార దర్పం ప్రదర్శించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఉండటానికి సొంత ఇల్లు లేదంటే నమ్ముతారా..? కానీ ఇది నిజం. ఇప్పుడు ఈ ప్రశ్నే గులాబీ బాస్‌ను వేధిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ నేరుగా ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు వెళ్లారు. వారితో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ తన ఇంటి కష్టాలను చెప్పి ఆవేదన చెందారట.
తన హయాంలో ప్రగతిభవన్ నిర్మించాను.. సచివాలయం కట్టించాను. కానీ ఓ సొంత ఇల్లు కట్టుకోలేపోయాను అని కేసీఆర్ వాపోయారట. ఆ మాటలు విని పలువురు నేతలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యే ఒకరు ఇటీవలే కట్టించిన తన కొత్త ఇంటిని ఇచ్చేస్తానని కేసీఆర్‌కు చెప్పారట. అయితే కనీసం పాతిక కార్లు పార్కింగ్ చేసుకునేంత విశాలంగా ఉండాలి కదా? అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లోని నందినగర్‌లో కేసీఆర్‌కు సొంతిల్లు ఉంది. అయితే ఇరుకైన రోడ్డు కావడం రాకపోకలకు అనువుగా లేకపోవడంతో అక్కడ ఉండేందుకు కేసీఆర్ సుముఖంగా లేరట. ఈ నేపథ్యంలో పార్టీ సమావేశాల కోసం కేసీఆర్‌కు అనువైన ఇంటి కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
కాగా 2014లో సీఎం పదవి చేపట్టాక బేగంపేట్‌లో ఉన్న ప్రగతిభవన్‌లోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉండే ప్రగతిభవన్‌లో పార్టీ సమావేశాల కోసం పెద్ద సంఖ్యలో వచ్చే వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలం ఉండేది. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల కోసం దాదాపు వెయ్యి మందితో కలిసి సమావేశం జరిపేందుకు వీలుగా అన్ని వసతులూ ఉండేవి. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రగతిభవన్ ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా అనువైన ఇల్లు కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.