ఎన్నికల సంస్కరణల ఆద్యుడు టీఎన్ శేషన్ ఇకలేరు..
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థకు కొత్త రూపు ఇచ్చిన.. ఎన్నికల సంస్కరణలకు ఆద్యుడుగా నిలిచిన మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ (87) తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం 9:30 గంటలకు చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూయగా.. ఆ వార్త అర్ధరాత్రికి బయటికి వచ్చింది. శేషన్ మృతికి పలువురు రాజకీయ నేతలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. శేషన్ అంత్యక్రియ నేడు జరగనున్నాయి.
జననం..
తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్ 1932 డిసెంబరు 15న కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన తిరునెళ్ళై గ్రామంలో జన్మించారు. అతను "బేసెల్ ఎవాంజెలిచల్ మిషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల"లో పాఠశాల విద్యను పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ ను పాలక్కాడ్ లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో చదివాడు. అతను మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతను ఐ.ఎ.ఎస్ పరీక్ష పాసయినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో మూడు సంవత్సరాలు డిమానిస్ట్రేటర్ గా పనిచేసాడు. తరువాత అతను హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఎడ్వర్డ్ ఎస్. మాసన్ ఫెలోషిప్ పొందాడు. అక్కడ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీని పొందాడు. టి.ఎన్.శేషన్, ఎ.శ్రీధరన్ లు బి.ఇ.ఎం పాఠసాల మరియు విక్టోరియా కళాశాలలో సహాద్యాయులు. వీరిద్దరూ కాకినాడ లోని ఇంజనీరింగ్‌కు ఎంపిక కాబడ్డారు. అయినప్పటికీ ఇ.శ్రీధరన్ దానిని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు కానీ శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చేరాలని నిర్ణయించుకున్నారు. 1959లో దిండిగల్ సబ్ కలెక్టరుగా సేవలనందించే సమయంలో అతను జయలక్ష్మిని వివాహమాడారు. ఆమె కేరళ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ఆర్.ఎస్. కృష్ణన్ కుమార్తె. పదవీ విరమణ చేసిన తరువాత శేషన్ పిల్లలు లేని కారణంగా కొద్దికాలంగా తన భార్యతో సహా వృద్ధాశ్రమంలోనే నివసిస్తూ వచ్చారు. ఆమె 2018 మార్చి 31 న మరణించారు.
ట్రాక్ రికార్డ్!
శేషన్ తన సోదరుడు టి.ఎన్.లక్ష్మీనారాయణన్ వలే సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నారు. 1953లో శేషన్ ఐఏఎస్‌కు హాజరగుటకు తక్కువ వయస్సు కలిగి ఉన్నారు. తన సామర్ధ్యాలను పరీక్షించేందుకు, అతను ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం పరీక్షకు హాజరయ్యారు. 1954 బ్యాచ్ భారతదేశంలో మొదటి స్థానం పొందారు. తర్వాత సంవత్సరం అతను 1955 బ్యాచ్ ఐఏఎస్‌కు హాజరై మంచి ర్యాంకు సంపాదించారు. ఐఏఎస్ అధికారిగా అతను తమిళనాడు మరియు కేంద్ర ప్రభుత్వాలలో వివిధ శాఖలలో సెక్రటరీగా తన సేవలనందించారు. అతను కేబినెట్ సెక్రటరీగా, సివిల్ సర్వీసులో సీనియర్‌గా, భారత దేశ ప్లానింగ్ కమిషన్ సభ్యునిగా కూడా పనిచేశారు. తర్వాత భారత ప్రధాన ఎన్నికల అధికారిగా తన సేవలనందించారు. అతను 1997 రాష్ట్రపతి ఎన్నికలలో కె.ఆర్. నారాయణన్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
శేషన్ వచ్చాక సీన్ మారింది!
శేషన్ రాకముందు ఎన్నికల సంఘం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. అంతేకాదు ఎన్నికల నిర్వహణ గందరగోళంగా ఉండేది. విచ్చలవిడిగా పోలింగ్ బూత్‌ల ఆక్రమణ జరిగేది. బ్యాలెట్ పేపర్లను చించి వేయడం, దౌర్జన్యంగా స్టేషన్లలో చొరబడి గంపగుత్తగా ఓట్లు గుద్దేయడం, బ్యాలెట్ బాక్స్ ల్లో సిరా పోయడం, బాక్సుల్ని ఎత్తు కెళ్లడం వగైరాలన్నీ రాజకీయ గూండాలకు హక్కుగా ఉండేవి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలపై ఈసీకి ఎలాంటి అదుపు ఉండేది కాదు. అసలు రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ని పెద్దగా పట్టించు కునేవి కావు. ఇలాంటి దశలో ఆరేళ్లపాటు సీఈసీ హోదాలో శేషన్ సంస్కరణలు మొదలెట్టారు. కేండిడేట్ల ఎన్నికల ఖర్చు పై లిమిట్‌ని గట్టిగా అమలు చేశారు శేషన్. డబ్బును బాహాటంగా మంచినీళ్లలా ఖర్చు పెట్టే రాజకీయ పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. గుడి, మసీదు, చర్చి వంటి పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిషేధించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) నూరు శాతం అమలు చేయించారు. ఈ విషయంలో శేషన్ నిజంగా చండశాసనుడే. గీత దాటారని గుర్తిస్తే.. ఎవరినైనా ఖాతరు చేయకపోయేది.
ఘనతలు..
ఎన్నికల నిబంధనావళి తూచా తప్పకుండా అమలు కావడానికి చర్యలు తీసుకున్న ఘనత శేషన్‌దే. అర్హులైన ఓటర్లకు గుర్తింపు కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఆయన ఘనతలు ఉన్నాయ్. ఎన్నికల సంస్కరణలను కఠినంగా అమలు చేసి ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించున్నారు శేషన్.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout