భారత కార్పోరేట్ రంగంలో విషాదం.. దిగ్గజ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత

  • IndiaGlitz, [Saturday,February 12 2022]

ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్‌ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. శనివారం మహారాష్ట్రలోని పుణెలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన చెంతనే ఉన్నారని వెల్లడించింది. గత కొంతకాలంగా న్యుమోనియా, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో రాహుల్ బజాజ్ బాధపడుతున్నారు.

జూన్ 10, 1938లో జన్మించిన రాహుల్ బజాజ్.. 1965లో బజాజ్‌ గ్రూప్‌ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కంపెనీకి సారథ్యం వహించారు. దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘హమారా బజాజ్’, ‘యూ కెనాట్ బీట్ బజాజ్’ లాంటి ట్యాగ్ లైన్లు ఆయన నేతృత్వంలో ఈ దిగ్గజ టూవీలర్ కంపెనీ రూపొందించినవే.

2005లో తన విధుల తప్పుకోగా.. ఆయన కుమారుడు రాజీవ్ బజాజ్‌ ఎండీగా బాధ్యతలు అందుకున్నారు. ఆయన ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్‌ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ రాహుల్ వైదొలిగారు. 2006 నుంచి 2010 వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన్ను భారత ప్రభుత్వం పద్మ భూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. రాహుల్ బజాజ్ మరణం పట్ల పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.