JD Lakshmi Narayana : మళ్లీ విశాఖ బరిలోనే ... ఏ పార్టీ నుంచి అంటే : 2024 ఎన్నికలపై జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ
- IndiaGlitz, [Saturday,December 10 2022]
ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది ముందుగానే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ తన సైన్యాన్ని మొహరిస్తోంది. సీఎం వైఎస్ జగన్ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈసారి 175కి 175 స్థానాల్లో గెలవాలని జగన్ నేతలకి టాస్క్ ఇచ్చారు. అటు ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఎన్నికలకు సర్వసన్నద్ధంగా వుంది. ఇదేం ఖర్మా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఇకపోతే.. ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వారంతా తమ అధినేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు సైలెంట్‌గా వున్న వారు సైతం ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతున్నారు.
ఓడినా .. జేడీకి భారీగా ఓట్లు:
ఇదిలావుండగా.. సిద్ధాంతాలు, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటూ వీఆర్ఎస్ తీసుకుని మరి రాజకీయాల్లోకి వచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. యూత్‌లో, మేధావి వర్గంలో ఆయనకున్న ఫాలోయింగ్‌తో మంచి ఓట్లే పొందారు. ఎన్నికల్లో ఓటమితో ఆయన కొన్నిరోజులుగా సైలెంట్‌గా వుంటున్నారు. జనసేనకు రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలో చేరకుండా తన పని తాను చేసుకుంటున్నారు.
రెండు రాష్ట్రాలు కలవాలన్న జేడీ:
అయితే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నేపథ్యంలో మరోసారి యాక్టీవ్ కావాలని చూస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై జేడీ స్పందించారు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే వుంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో వుందని, అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలే వుండవని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. తన ఆలోచనలకు దగ్గరగా వుండే పార్టీ తరపున పోటీ చేస్తానని జేడీ తెలిపారు.
ఇండిపెండెంట్‌గా నైనా పోటీ చేస్తానంటోన్న జేడీ :
ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా వున్నందున ఈ రెండింట్లో ఏదో పార్టీలోకి జేడీ వెళతారనే ప్రచారం జరుగుతోంది. రెండు పార్టీలు కలిస్తే విశాఖ ఎంపీ సీటు అవలీలగా సొంతం చేసుకోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏ పార్టీలో చేరుకున్నా స్వతంత్రంగానైనా జేడీ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్యకర్తలకు మద్ధతుగా ఆయన హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ వుండటం, విశాఖలోని సమీకరణాలు తనకు కలిసి వస్తాయని లక్ష్మీనారాయణ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా పార్టీ నుంచి కానీ, ఇండిపెండెంట్‌గా గానీ ఆయన పోటీ చేయడం మాత్రం ఖాయం అని తేలిపోతోంది.