YCP leader:జగనన్న క్షమించు.. టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నాను: వైసీపీ నేత
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. పోలింగ్‌కు మరో 20 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకపోతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో షాక్ తగిలింది. పర్చూరు వైసీపీ నేత గొట్టిపాటి భరత్.. తన సోదరి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో తన అక్కకు మద్దతుగా నిలుస్తున్నట్లు భరత్ ప్రకటించారు. తనను పర్చూరు నియోజకవర్గ ప్రజలు క్షమించాలి అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
'గౌరవనీయులైన పర్చూరు నియోజకవర్గ ప్రజానికానికి, కార్యకర్తలకు మరియు నాయకులకు నా నమస్కారాలు. నా తండ్రి గొట్టిపాటి నరసింహారావు మరణాంతరం నాకు జగనన్న పర్చూరు ఇంఛార్జిగా ప్రకటించినప్పటి నుంచి, నా ప్రయాణం మీతోనే సాగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓడిపోవడం జరిగింది. దాని తరువాత ఐదేళ్ల పోరాటంలో నాతో కలిసి ఎన్నో కేసులు, అవమానాలు పడ్డారు, నా సుఖాల్లో కంటే నా కష్టాల్లోనే నాకు తోడు నీడగా నిలిచారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇంఛార్జ్‌ల మార్పులవల్ల వచ్చిన కొత్తవారికి సమన్వయలోపం వల్ల కష్టపడే నాయకులకి అసలైన YSRCP కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయాను నన్ను క్షమించాలి' అని కోరారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో నా కష్టం, నా త్యాగం మీ అందరికీ తెలిసిందే, నా కష్టంలో నా అక్క నాకు తోడుగా నిలిచింది. నేను 150 ఎకరాలు అమ్మినా ఏంటి, ఎందుకు అని అడక్కుండా సంతకం పెట్టింది. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టినా నన్ను ఏనాడు ప్రశ్నించలేదు. మెడికల్ క్యాంప్ పెట్టడం కానీ, పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్ళినా, నామ మాత్రపు ఫీజు తీసుకుని వైద్యం చేసింది. ఇప్పటివరకు నా అక్క నన్ను ఏమి అడగలేదు కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో నాకు తోడుగా నిలబడు అని అడిగింది. నా అక్కకి తోడుగా నిలబడటం నా ధర్మంగా భావించి దర్శికి వెళ్తున్నాను. జగనన్న నన్ను క్షమించండి నాకు మీరు ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపించారు, కానీ నా ధర్మం నేను నిర్వర్తించి నా వంతుగా నేను నా అక్కకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను' అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పర్చూరు, దర్శి నియోజకవర్గాల్లో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడు గొట్టిపాటి భరత్. నరసయ్య గతంలో టీడీపీలో ఉండగా.. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న సమయంలో 2013లో కన్నుమూశారు. అనంతరం ఆయన కుమారుడు భరత్‌ను పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భరత్ పర్చూరు నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయితే ఇటీవల భరత్ సొంత సోదరి లక్ష్మికి టీడీపీ దర్శి టికెట్ ఇచ్చింది. దీంతో తన అక్కకు అండగా నిలబడాలని భరత్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వీరికి సొంత బాబాయ్ అవుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments