'భరత్ అనే నేను' కోసం 25 ఏళ్ళ తరువాత..
- IndiaGlitz, [Thursday,April 19 2018]
సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘జంబలకిడి పంబ’ (1993) సినిమాతో టాలీవుడ్‌కు నిర్మాతలుగా పరిచయమయ్యారు డి.వి.వి.దానయ్య, భగవాన్, పుల్లారావు. శ్రీ బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో నరేష్, ఆమని జంటగా నటించారు. ఈ కామెడీ ఫిల్మ్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించింది ఈ త్రయం. కట్ చేస్తే.. ఆ తరువాత యూనివర్శల్ మీడియా, డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సోలో ప్రొడ్యూసర్‌గా పలు చిత్రాలను నిర్మించారు డి.వి.వి.దానయ్య.
తాజాగా.. మహేశ్ బాబు హీరోగా ఆయన నిర్మించిన ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాతగా దానయ్యకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కావడం విశేషం. ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం ఏమిటంటే.. దానయ్య తొలి చిత్రంలో హీరోయిన్గా నటించిన ఆమని.. దాదాపు 25 సంవత్సరాల తర్వాత దానయ్య నిర్మించిన ‘భరత్ అనే నేను’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి..‘జంబలకిడి పంబ’లాగే ‘భరత్ అనే నేను’ కూడా సంచలనాలకు తెరతీస్తుందేమో చూడాలి.