మోదీకి ఫుట్‌బాల్.. ట్రంప్‌కు క్రికెట్!
- IndiaGlitz, [Monday,February 24 2020]
టైటిల్ చూడగానే కాస్త కన్ఫూజ్ అయ్యారు కదూ..! అవును.. మీరు వింటున్నది నిజమేనండోయ్.. నాడు అమెరికాలో అతిపెద్ద స్టేడియం అయిన ఫుట్‌బాల్ స్టేడియంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్కమ్ పలికారు. అయితే అంతే రీతిలో నేడు ఇండియాలో అతిపెద్దదైన క్రికెట్ స్టేడియం (మెతేరా)లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు.. కలలో కూడా ఊహించని రీతిలో.. ఆయన అనుకున్నదానికంటే రెట్టింపుగానే ఘన స్వాగతం లభించింది.
నమస్తే అంటూ ప్రసంగం!
సబర్మతీ ఆశ్రమం సందర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా గుజరాత్‌లోని మెతెరా స్టేడియం చేరుకున్నారు. అక్కడ జరగుతున్న ‘నమస్తే ట్రంప్’ పాల్గొన్నారు. మొదట మోదీ మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రంప్ కూడా ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సబర్మతి ఆశ్రమం సందర్శనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తనకు నిజమైన మిత్రుడని.. ఆయనకు అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రసంగంలో భాగంగా మరోసారి మోదీకి ఆయన అభినందనలు తెలిపారు. ‘నమస్తే’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అప్పుడు.. ఇప్పుడు అతి పెద్దవే..!
‘అద్భుత విజేతగా భారత్ అభివృద్ధి కోసం మోదీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఐదు నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ స్టేడియంలో మోదీకి స్వాగతం పలికాం. ఇప్పుడేమో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంలో నాకు స్వాగతం పలికారు. మీ సాదర స్వాగతానికి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని ట్రంప్ అన్నారు. అంటే.. అక్కడ తనకు అతి పెద్ద మైదానంలో ఘన స్వాగతం పలికారు గనుక.. మనం కూడా అతి పెద్ద మైదానంలోనే స్వాగతం పలికి మాట్లాడించాలని మోదీ అనుకున్నారేమో!. అక్కడ మోదీకి ఫుట్‌బాల్.. ఇక్కడ ట్రంప్‌కు క్రికెట్.. మైదానం అన్న మాట.
స్టార్లు అసూయ పడేలా..!
అమెరికాలోని హూస్టన్ ఎన్ఆర్జీ స్టేడియం వేదికగా ‘హౌడీ మోదీ’ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో భారీ జనసందోహం, ‘మోదీ.. మోదీ’ అంటూ గొంతులు బొంగురుపోయేలా జనాల అరుపులు, రంగురంగుల వెలుగులు, సంగీతం, డ్యాన్స్‌తో కార్యక్రమం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం అసూయపడేంత అద్భుతంగా సాగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.