ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇక లేరు..
- IndiaGlitz, [Tuesday,August 04 2020]
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో గుండెపోటుతో నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1943లో పెదబొండపల్లిలో వంగపండు ప్రసాదరావు జన్మించారు. ఆయన తన జీవిత కాలంలో మూడు వందలకు పైగా జానపద పాటలు రచించి విప్లవకవిగా మంచి గుర్తింపు పొందారు.
1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో బడుగుబలహీన వర్గాలను, గిరిజనులను చైతన్య పరిచారు. ‘అర్థరాత్రి స్వాతంత్ర్యం’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని వంగపండు ప్రారంభించారు. ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ’ పాటతో ప్రజలను ఉర్రూతలూగించారు. 2017లో వంగపండు కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు.